దివంగత బాలీవుడ్ హీరో, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచార విడుదల కోసం అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలోకి విడుదలకానుంది. అందులో భాగంగా డిస్నీ+హాట్ స్టార్ ఈచిత్రాన్ని విడుదలచేయనుంది. ఇక ఈచిత్రం ఈనెల 24న రాత్రి 7:30 గంటలకు స్ట్రీమింగ్ లోకి రానుంది.
 
ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై  ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లైక్స్ ను సొంతం చేసుకున్న మొదటి ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇక  మరో రెండు రోజుల్లో సినిమా విడుదలకానుండడంతో ఇండియాలో హైయెస్ట్ స్ట్రీమింగ్ మూవీగా దిల్ బేచార రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే హాట్ స్టార్ ,సుశాంత్ గౌరవార్ధం ఈసినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తుంది. 
 
ముఖేష్ చాబ్రా డైరెక్షన్ లో సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో సంజనా సంఘీ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహెమాన్ సంగీతం అందించగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈచిత్రాన్ని నిర్మించింది. ఇదిలావుంటే గత నెల 14న సుశాంత్ తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈకేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఇక కై పొచే తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్... ప్రముఖ క్రికెటర్ ,టీమిండియా మాజీ కెప్టెన్, ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఏంఎస్ ధోనిలో టైటిల్ రోల్ లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ తన కెరీర్ లో మొత్తం 12చిత్రాల్లో నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: