
రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్య బృందంలో ఉండే కీలక వ్యక్తులలో పూరీ జగన్నాథ్ కు అగ్రస్థానం. వీరిద్దరూ తరుచూ కలవడం కూడ పరిపాటి అయితే ప్రస్తుతం వర్మ తన పవర్ స్టార్ మూవీతో పవన్ చిరంజీవి లను టార్గెట్ చేస్తూ తన వ్యూహాలు కొనసాగిస్తూ ఉంటే ఈ విషయాలను పట్టించుకోకుండా పూరీ చిరంజీవిని కలిసి ఒక కథను చెప్పడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో క్లారిటీ లేకపోయినా షూటింగ్ లు లేక ఖాళీ బాగా దొరకడంతో చిరంజీవి అవకాశం దొరికినప్పుడల్లా తనకు కథలు చెప్పే అవకాశం అనేకమంది దర్శకులకు ఇస్తున్నాడు. దీనితో కొంతమంది అయితే చిరంజీవి ఈ వయసులో ఇన్ని సినిమాలు ఎక్కడ చేస్తాడు అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు.
ఈ విషయాలను గ్రహించిన పూరీ ఇప్పుడు తన వద్ద ఒక పవర్ ఫుల్ కథ ఉందని చిరంజీవి అంగీకరిస్తే ఆయనకు చెపుతాను అంటూ రాయబారాలు చేస్తున్నట్లు టాక్. గతంలో చిరంజీవి 150 సినిమాకు దర్శకత్వం వహించాలని పూరీ చాల గట్టి ప్రయత్నాలు చేసి భంగపడిన విషయం తెలిసిందే. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ పూరీ టాప్ హీరోలకు నమస్కారాలు పెడుతూ కథలు చెప్పే ఓపిక తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు.
అయితే వెంటనే తన అభిప్రాయాలు మార్చుకుని ఇప్పుడు యూటర్న్ తీసుకుని చిరంజీవికి కథ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో పూరి జగన్నాథ్ గురువు రామ్ గోపాల్ వర్మ ఒక మార్గంలో వెళుతుంటే శిష్యుడు పూరీ చిరంజీవిని ప్రశన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు అన్న విషయం మరొకసారి బయటపడుతూ పూరీ జగన్నాథ్ చిరంజీవి కోసం వ్రాసిన కథ ఏమిటి అంటూ కొందరు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు..