మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. సంచలన వ్యాఖ్యలు చేసి ఆయన గతంలో ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రెహమాన్ కు బాలీవుడ్ కోపం తెప్పించింది. గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ లో సినీ పరిశ్రమలో ఒక వర్గం టాలెంట్ ను తొక్కేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏఆర్ రెహమాన్ ఈ ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ "అవును.. ఓ గ్యాంగ్ నన్ను కూడా తొక్కేసింది" అంటూ సంచలన ప్రకటన చేశారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ ఇలాంటి ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది. ఓసారి దర్శకుడు ముకేష్ ఛబ్రా తన దగ్గరకు వచ్చాడని.... ఆయనకు నేను జస్ట్ 2 రోజుల్లో 4 పాటలిచ్చానని... ఆ సందర్భంలో ఆయన తన దగ్గరకు వెళ్లవద్దని కొందరు కథలుకథలుగా చెప్పారని చెప్పాడని అన్నారు.
అప్పుడే తనకు బాలీవుడ్ నుంచి తక్కువగా అవకాశాలు రావడానికి కారణాలు అర్థమైందని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తను డార్క్ మూవీస్ మాత్రమే చేస్తున్నానని... పెద్ద సినిమాలు తనకు రాకుండా ఓ గ్యాంగ్ అడ్డుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తాను మరిన్ని మంచి పాటలు చేయాలని కోరుకుంటున్న ఒక గ్యాంగ్ తనను అడ్డుకుంటోందని... తాను విధిని నమ్ముతానని... తన దగ్గరకు వచ్చిన సినిమాలను తాను చేస్తున్నానని అన్నారు.
తనపై తప్పుడు కథలు ప్రచారంలో ఉన్నాయని... అలాంటు కట్టుకథలను నమ్మాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని.... ఎవరైనా మంచి ప్రాజెక్టులతో తనను సంప్రదించవచ్చని అన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం గురించి బాలీవుడ్ లో పెద్ద దుమారం రేగింది.