ఎవరెన్ని తిట్టినా.. పిచ్చోడు అన్నా.. తనపై ఎన్ని సినిమాలు తీసినా.. పాటల్లో బండ బూతులు తిట్టినా.. వర్మ మాత్రం మెగా ఫ్యామిలీని వదిలిపెట్టడం లేదు. పవర్ స్టార్ తర్వాత మరోసారి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేస్తూ.. ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు.
కరోనా వర్మ కోసమే వచ్చిందా అనేలా ఉంది. ఈ మహమ్మారి వచ్చి అందరినీ ఇంట్లో కూర్చోబెడితే.. వర్మ మాత్రం చెలరేగిపోతున్నాడు. రెండున్నర గంటలుండే సినిమాను 20.. 30 నిమిషాలకు కుదించేసి.. చుట్టేస్తున్నాడు. ఓటీటీలో రీలీజ్ చేస్తున్నాడు. హైప్ కోసం హడావిడి చేసినంత టైమ్ కూడా పవర్ స్టార్ తీయడానికి పట్టలేదు. 37 నిమిషాలున్న పవర్ స్టార్ కు సినిమా అని పేరు పెట్టాడు. మధ్యమధ్యలో తన పైత్యానికి తగ్గట్టు అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూనే.. ఎక్కడ తనను మర్చిపోతారన్న భయంతో కాంట్రవర్శీలను గిల్లుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఉదయ్ కిరణ్ జీవితాన్ని సినిమాగా తీసేస్తున్నాడు. పవర్ స్టార్ సినిమాకు ఎన్నికల తర్వాత జరిగిన కథ అని ట్యాగ్ లైన్ ఇచ్చినట్టు.. ఉదయ్ కిరణ్ సినిమాకు హీరో అయిన తర్వాత కథ అని పెడతాడేమో చూడాలి.
మెగా ఫ్యామిలీతో ఆడుకోవడం కోసమే.. ఉదయ్ కిరణ్ జీవితాన్ని ఎంచుకున్నాడు ఆర్జీవీ. ఉదయ్ బయోపిక్ అంటే.. మెగా ఫ్యామిలీ రావాల్సిందే. వర్మ తీసేది కూడా అందుకోసమే. పవన్ కళ్యాణ్ గురించి పవర్ స్టార్ తీసేశాడు. ఇక ఆయన తీయడానికి ఏమీలేదు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. హైప్ రాదు. అందుకే చిరంజీవి పెద్ద కూతురితో ఉదయ్ కిరణ్ ఎంగేజ్ మెంట్.. ఎందుకు ఆగిపోయింది.. ఆ తర్వాత కథేమిటి.. అనే పాయింట్ తో మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు వర్మ.
ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడన్న పాయింట్ కు.. మెగా ఫ్యామిలీని జోడిస్తే.. క్రేజ్ వస్తుందన్న ఐడియాతో వర్మ ఉన్నాడట. పవర్ స్టార్ సినిమా మాదిరే.. ఇందులో పాత్ర ఎవరినైనా పోలి ఉంటే యాధృశ్చికమే అనే డైలాగ్ నే మరోసారి చెబుతాడు. పవన్ కళ్యాణ్ పేరు ప్రవణ్ కళ్యాణ్ గా మార్చినట్టు.. హ్రిదయ కిరణ్ అని మారుస్తాడేమో చూడాలి.