టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రఖ్యాత దర్శకుడు విజయబాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్, టాలీవుడ్ నటుడు మురళీమోహన్ మెగాస్టార్ చిరంజీవి సోదరురులు గా నటించారు. అప్పట్లో అతిపెద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరిగే రాజారామ్ అనే యువకుడు, తన రెండవ అన్నయ్య చదువు కోసం చెయ్యని నేరాన్ని తనమీద వేసుకుని తద్వారా వచ్చిన డబ్బుల్ని అతడి చదువు కోసం అందిస్తాడు. అయితే గతంలో తన పెద్ద అన్నయ్యది మాములు మరణం కాదు హత్య అని తెలుసుకుని, ఆ తర్వాత దానికి కారకులైన వారిని ఎలా మట్టుపెట్టాడు అనే కథాంశంతో పలు కమర్షియల్, ఎంటర్టైనింగ్ అంశాల మేళవింపుగా దర్శకుడు విజయబాపినీడు, ఈ సినిమాని ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. కాగా ఈ సినిమాని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రీమేక్ చేయబోతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారని అంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా రీమేక్ విషయమై ఒరిజినల్ వర్షన్ హక్కులు కొనుగోలు చేసిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఒకరు, కొద్ది రోజుల క్రితం చిరంజీవిని కలిసి చరణ్ తో ఈ సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారట. దానికి ఒప్పుకున్న చిరంజీవి, ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా, అది పూర్తి అయిన తర్వాత దీనిని తెరకెక్కించేలా ప్లాన్ చేద్దాం అంటూ మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది దసరా సమయానికి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు గానీ, ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఇది అతి పెద్ద పండుగ వార్త అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!