తెలుగు చిత్ర పరిశ్రమలో తన తొలి చిత్రం పెళ్లి చూపులతో ఓ వెలుగు వెలిగిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా ఇచ్చిన క్రెడిట్ తో తరుణ్ ట్రెండీ డైరెక్టర్ గా నోటెడ్ అయిపోయాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ లో ఈ నగరానికి ఏమైంది అంటూ చేసిన ప్రయోగం ప్రేక్షకుల ఆదరణను పొందింది. అయితే కమర్షియల్ లెక్కల్లో చూసేసరికి పెళ్లి చూపులు తరహా ప్రభావాన్ని మాత్రం చూపలేకపోయింది.
దర్శకుడిగా ముచ్చటగా మూడో సినిమాతో వస్తాడనుకున్న సమయంలో.. ఉన్నట్టుండి నటుడిగా.. ఫలక్ నుమా దాస్ లో పోలీస్ పాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నాడు. మెగా ఫోన్ పట్టాల్సిన వాడు ఉన్నట్టుండి ఈ టర్న్ ఎందుకు తీసుకున్నాడా అని అందరూ అనుకున్నారు. అయితే ఆ టైమ్ లో ఎవరికి మాత్రం తెలుసు.. తరుణ్ భాస్కర్ లో మల్టీ టాస్క్ పర్సన్ ఉన్నాడని.
ఇక ఫలక్ నుమా దాస్ తో ఆగిపోతాడనుకున్న తరుణ్ భాస్కర్.. అక్కడితో ఆగకుండా తాను హీరోగా నిలబెట్టిన విజయ్ దేవరకొండ చలువతో మీకు మాత్రమే చెబుతానంటూ ఓ మెరుపు మెరిశాడు. సినిమా కనిపించకుండా పోయినా.. మనోడిలో యాక్టింగ్ స్కిల్స్ మాత్రం కనిపించాయి. ఇప్పుడిదే నమ్మకంతో మరోసారి తన నటనా ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యాడు. నేను మీకు చెప్తా అనే షోతో హోస్ట్ గా అవతారమెత్తాడు తరుణ్ భాస్కర్. దర్శకుడిగా.. రచయితగా.. నటుడిగా.. మంచి గుర్తింపును సొంతం చేసుకున్న తరుణ్ భాస్కర్.. ఓ వెబ్ సిరీస్ కోసం సింగర్ అవతారం ఎత్తాడు. ఇలా మల్టీ టాలెంట్స్ అన్నీ బయటకు తీస్తున్న తరుణ్ భాస్కర్ లేటెస్ట్ గా బిన్జ్ ఇట్ అనే ఓయాప్ ని డిజైన్ చేసి మార్కెట్ లో వదిలాడు.