ఆన్‌లాక్ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలు జరుపుకోవచ్చని తెలిపింది. లాక్‌డౌన్ విధించిన మార్చి 25వ తేదీ నుంచి ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం కొన్ని రాష్ట్రాల్లో షూటింగులు ప్రారంభించినప్పటికీ కరోనా ఉద్ధృతి పెరగడంతో నిలిపివేశారు. కేంద్రం ఇచ్చిన అనుమతులతో మళ్లీ సినిమా, టీవీ సీరియల్స్ చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి.
షూటింగులకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది మొత్తం ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. ఆరోగ్య సేతు యాప్‌ను నటీనటులంతా ఉపయోగించాలి. షూటింగ్ సమయాల్లో విజిటర్లకు అనుమతి లేదు. మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి. సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చూడాలి. థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలి. షూటింగ్ పాయింట్ వద్ద సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి. చిత్రీకరణ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండాలి.
కేంద్రం షూటింగులపై స్పష్టత ఇవ్వడంతో.. సినిమాలు, సీరియళ్ల చిత్రీకరణలు మొదలు కానున్నాయి. మొత్తానికి షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నాళ్లూ సినిమా యూనిట్ సభ్యలు షూటింగ్ లు లేక ఆర్థికంగా చితికిపోయారు. ఇపుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఒకింత సంతోషం వారిలో నెలకొంది.