ఇంతకీ పవన్ కల్యాణ్ ఎందుకు సిక్స్ ప్యాక్ చేయలేదో మీకు తెలుసా? సిక్స్ ప్యాక్ గురించి పవన్ గతంలో చెప్పిన మాటల్ని.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. సిక్స్ ప్యాక్ గురించి పదే పదే పవన్ ని ప్రశ్నిస్తున్నసందర్భంలో ఆయన తన మనసులో మాట ఇలా బైటపెట్టారు. " యువత అంతా ఇప్పుడు సిక్స్‌ప్యాక్, ఎయిట్ప్యాక్ కోసం శ్రమ పడుతున్నారు. నన్ను చాలా మంది మీరెందుకు సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించలేదని అడుగుతుంటారు. అయితే నాకు వాటిపై ఎప్పుడూ ఆసక్తిలేదు. నేను ధైర్యం అనే బలం కోసం పనిచేసేవాడిని. కండలు పెంచడం చాలా సులువు. అదే గుండె ధైర్యాన్ని పెంచాలంటే చాలా కష్టం. దానికి పిరికితనాన్ని జయించాలి. ఓ రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ ధైర్యం ఎంతో కావాలి" అని చెప్పుకొచ్చారు.
అంటే పవన్ కల్యాణ్ కి పైకి కనిపించే కండలకంటే.. లోపల ఉండే ధైర్యంపైనే నమ్మకం ఉందట. అందుకే తాను సిక్స్ ప్యాక్ కి దూరంగా ఉన్నాని చెబుతారు పవన్ కల్యాణ్. పైకి కండలతో కనిపించినా లోపల పిరికితనం ఉంటే దాన్ని మించిన లోపం ఇంకోటి లేదని, అందుకే తాను పిరికితనాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తుంటానని అంటారు. తన చుట్టూ ఉన్నవారిలో, ప్రజల్లో పిరికితనం లేకుండా చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అధికారంలో ఎవరు ఉన్నా ప్రశ్నించడం తన ఆనవాయితీ అని చెబుతారు పవన్ కల్యాణ్. కండలు పెంచడం సులువు, కానీ ధైర్యాన్ని పెంచడం అంత సులభమైన పని కాదని చెప్పే పవన్ కల్యాణ్.. జనసైనికులెప్పుడూ గుండెలనిండా ధైర్యంతో ఉండాలని సూచిస్తున్నారు.