ఏ చికూచింతా లేకుండా హాయిగా ఇంట్లో కూర్చుని మూడ్‌ వచ్చినప్పుడు వెంటనే  సినిమా చూసేయడానికి ఓటీటీ బాగా ఉపయోగపడుతోంది. సినిమా నచ్చితే ఎన్నిసార్లయినా చూడొచ్చు. అయితే.. ఓటీటీ వాళ్లకు మాత్రం ఓ ప్రాబ్లమ్ మింగుడుపడడం లేదు. సినిమా రిలీజ్‌ చేయడం ఆలస్యం.. చేతిలో పైరసీ వచ్చి పడుతోంది. పైరసీ ఎప్పుడొస్తుందా? అని వెయిట్‌ చేయకుండా.. అర్ధరాత్రి సినిమా చూసేసి నిద్రబోపోతున్నారు పైరసీ ప్రేమికులు‌.

థియేటర్‌లో రిలీజైన సినిమాకు పైరసీ రావాలంటే.. ఒకటి రెండు రోజులు వెయిట్‌ చేయాలి. కానీ.. ఓటీటీ పైరసీ అలా కాదు. సబ్‌ స్క్రైబర్స్‌  డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమా చూస్తుంటే.. మరోవైపు.. పైరసీ కాపీ చూస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. పైరసీ రావడానికి పెద్ద సమయం తీసుకోవడం లేదు. ఓటీటీ పుణ్యమా అని పైరసీ ప్రియులకు ఇన్‌ స్టెంట్ పైరసీ అందుబాటులోకి వచ్చింది.

ఇన్‌స్టెంట్‌ పైరసీ ఓటీటీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈనెల 5న వి సినిమా రిలీజ్‌ అంటే.. ముందురోజే 4 అర్ధరాత్రి 11 గంటలకు అమేజాన్‌ స్ట్రీమ్‌లో రిలీజైంది. గంట వ్యవధిలో పైరసీ వచ్చేసింది. 5న ఉదయం లేచిన తర్వాత చూద్దామలే అనుకున్న వారికంటే.. ముందే.. పైరసీ లవర్స్ చూసేసి.. సోషల్‌ మీడియాలో రివ్యూలు పెట్టేశారు. వి సినిమా అనే కాదు.. ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న ప్రతి సినిమా పరిస్థితి ఇంతే. పెద్దగా క్రేజ్‌ లేని సినిమాలు ఓ గంట ఆలస్యం రావచ్చు.. కానీ.. క్రేజీ మూవీ పైరసీ మాత్రం ఇన్‌స్టెంట్‌గా వచ్చేస్తోంది.

థియేటర్స్‌ నుంచి వచ్చిన పైరసీలో సౌండ్‌, విజువల్‌ సింక్‌ అయ్యేవి కాదు. సినిమా బాగుందన్న టాక్‌ వస్తే.. ప్రింట్‌ క్లారిటీగా లేదని.. థియేటర్‌కే వెళ్దామనుకుంటారు. ఓటీటీ పైరసీ మాత్రం  ఒరిజినల్‌ ప్రింట్‌తో పోటీపడుతూ ఆకట్టుకుంటోంది. ఇలా ఇన్‌స్టెంట్‌ పైరసీతో ఓటీటీలు తీవ్రంగా నష్టపోతాయనేది ఇన్‌సైడ్‌ టాక్‌. ఓ క్రేజీ మూవీతో కొత్త సబ్‌ స్క్రైబర్స్‌ ను  ఆకర్షిద్దామని ఓటీటీలు ప్లాన్‌ చేస్తుంటే.. ఎలాగూ మంచి ప్రింటే వస్తుంది కదా.. పైరసీ చూద్దాములే అనే మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు ప్రేక్షకులు. ఈ పైరసీ ఓటీటీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాగే కొనసాగితే.. ఇప్పటిలా భారీ రేటుకు డిజిటల్‌ రైట్స్ కొనే అవకాశం ఉండదు. ఓటీటీతో బయటపడదామనుకున్న నిర్మాతలు ఇబ్బందులు తప్పవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: