ఎవరైనా యు టర్న్ ఒకసారి తీసుకుంటారు. కానీ.. సునీల్ మాత్రం రెండు మూడుసార్లు తీసుకున్నాడు. తాజాగా మరోసారి కెరీర్‌కు ఛేంజ్ ఓవర్ వేసి.. హీరోగా నటిస్తున్నాడు. కమెడియన్‌గా.. విలన్‌గా సక్సెస్ రాకపోవడంతో.. 'వేదాంతం రాఘవయ్య' సినిమాతో మళ్లీ హీరోగా మారాడు సునీల్. కమెడియన్‌గా సునీల్ తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఒకానొక టైంలో హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్ అనిపించుకున్నాడు. హీరోగా టర్న్ అయిన తర్వాత అందాలరాముడు... మర్యాదరామన్న.. పూలరంగడుతో హిట్స్ కొట్టాడు. హీరోగా నీకు తిరుగులేదు... కంటిన్యూ చేయమని.. ఓ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ ఇచ్చిన సలహాను పాటించి తెలుగులో అడ్రస్ మిస్ చేసుకున్నాడు సునీల్. హీరోగా నటించిన చిత్రాలేవీ హిట్ కాకపోవడంతో... మళ్లీ కమెడియన్‌గా యు టర్న్ తీసుకున్నాడు సునీల్.
హీరోయిజం పక్కన పెట్టేసిన సునీల్‌కు కమెడియన్‌గా అరకొర ఛాన్సులే వచ్చాయి. హాస్య నటుడిగా పూర్వవైభవం చూడాలనుకున్న సునీల్‌కు చుక్కెదురైంది. ఈ క్రమంలో... కమెడియన్ కాస్తా.. విలన్‌గా మారాడు. ఇలా ప్రతి నాయకుడిగా నటించిన డిస్కోరాజా డిజాస్టర్ కావడంతో.. సునీల్ పెర్‌ఫార్మెన్స్ హైలైట్ కాలేదు.మరో కమెడియన్ సుహాస్ హీరోగా నటిస్తున్న 'కలర్ ఫొటో'లో ప్రతినాయకుడిగా నటిస్తూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సునీల్ .
కమెడియన్‌గా.. హీరోగా.. విలన్‌గా కనిపించిన సునీల్ మరోసారి కథానాయకుడు అవతారమెత్తాడు. హాస్య నటుడిగా ఒకటీ అర ఆఫర్సే రావడంతో.. హరీష్ శంకర్ ఇచ్చిన హీరో ఛాన్స్‌ను ఉపయోగించుకుంటున్నాడు. హరీష్ రాసుకున్న కథకు సునీల్‌ను హీరోగా సెలెక్ట్ చేశాడు. సినిమాకు 'వేదాంతం రాఘవయ్య' అన్న టైటిల్ పెట్టాడు. హరీశ్ దర్శకత్వంలో గద్దలకొండ గణేష్ తీసిన 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హరీష్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు.. ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది.