శ్రీనువైట్ల సినిమాలన్నీ ఒకేలా ఉన్నా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందించేవాడు. రానురానూ ఒకే మూసలో వెళ్లిపోయేసరికి ఈ డ్రామా కథలకు ప్రేక్షకులు మంగళహారతి పాడారు. ఏసినిమా కథ చూసినా.. కథనం చూసినా.. డిటో అన్నట్టే వుంటుంది. ఇలా మూసలో పడి బోర్ కొట్టేలా తీయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. శ్రీనువైట్ల పేరు చెబితే.. హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. మెగాఫోన్ పట్టాలని రెండేళ్లుగా చూస్తున్నా.. ఆఫర్ ఇచ్చేవారు కనిపించలేదు.
శ్రీనువైట్ల అంటే గతంలో రెడీ.. ఢీ.. వెంకీ.. దూకుడు వంటి కామెడీ హిట్స్ గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఆగడు.. బ్రూస్లీ.. మిస్టర్.. అమర్ అక్బర్ ఆంటోని వంటి భయంకరమైన ఫ్లాపులు గుర్తుకొస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనే జానర్‌తో సక్సెస్ అవ్వొచ్చని చెప్పిన తొలి దర్శకుడు శ్రీనువైట్లానే. ఇదే దారిలో చాలామంది యువ దర్శకులు నడిచి సక్సెస్ అయ్యారు. కానీ.. ఈ జానర్ క్రియేట్ చేసిన శ్రీనువైట్లకు ఫ్యూచర్ కనిపించడం లేదు. దీంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శ్రీనువైట్ల మధ్యలో కొత్తవారితో చిన్న సినిమా.. లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేసినా కుదర్లేదు. దీంతో.. తనకు హిట్ తీసుకొచ్చిన ఢీ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేశాడు.
శ్రీనువైట్ల ఆమధ్య విష్ణుతో ఢీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడిచింది. ఈ ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగినా.. ఎనౌన్స్ చేయలేదు. అయితే.. లేటెస్ట్గా విష్ణు రిలీజ్ చేసిన పోస్టర్ ఢీ సీక్వెల్‌పై ఆసక్తి రేపింది. ఢీ పోస్టర్ పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టాడు విష్ణు. ఈలెక్కన ఢీ వచ్చిన 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ఆ క్వశ్చన్ మార్క్‌కు ఆన్సర్ ఈనెల 23న రివీల్ చేయనున్నాడు విష్ణు. ఢీ సినిమాకు సీక్వెల్ తీసి మెప్పించడం చాలా కష్టం. ఢీ కంటే ఎక్కువ నవ్విస్తేనే.. ప్రేక్షకులు ఈ సీక్వెల్‌ను యాక్సెప్ట్ చేస్తారు.