తాజాగా రైతుల ఆందోళనపై స్పందించలేదనే ఆగ్రహంతో.. పంజాబ్‌కు చెందిన రాజ్ దీప్ సింగ్ అనే యువకుడు ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కారును అడ్డుకున్నాడు. ముంబై రోడ్డుపై అజయ్ దేవగన్ కారు రావడాన్ని గమనించిన రాజ్ దీప్ సింగ్.. ఆయనను చూస్తూ గట్టిగా మాట్లాడాడు. మీరు మా ఆందోళన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మీరు రైతుల కష్టం తెలియడం లేదా ? అని అన్నారు. మీరు రోజూ తిండి పెట్టే రైతు గురించి ఎందుకు మాట్లాడం లేదని అన్నారు.
ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న డిందోషి పోలీసులు.. రాజ్ దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసి అజయ్ దేవగన్ కారును అక్కడి నుంచి పంపించేశారు. రాజ్ దీప్ సింగ్‌పై సెక్షన్ 504, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రేపు అతడికి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక రాజ్ దీప్ సింగ్ తన కారును అడ్డుకుని మాట్లాడినంత సేపు కారులో ఉండిపోయారు అజయ్ దేవగన్. మధ్య మధ్యలో అతడికి నమస్కారం చేశారు.
అయితే మరోవైపు రైతు ఆందోళనలపై గత నెల 3వ తేదీన అజయ్ దేవగన్ పరోక్షంగా స్పందించారు. దేశం, దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు. అంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ బాలీవుడ్‌లోని పలు సినిమాలతో పాటు ప్యాన్ ఇండియా వైడ్‌గా తెరకెక్కుతున్న రాజమౌళి నయా మూవీ ఆర్ఆర్ఆర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.