టాప్గేర్లో దూసుకుపోతున్న శ్రుతిహాసన్ బుధవారం నాడు 29వ పుట్టినరోజు చేసుకుంటోంది. అయితే.. ఈసందర్భంగా ఆమె అభిమానులకు ఓ మంచి కానుక ఇస్తోంది. తనను సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం మీద కలిసే సువర్ణావకాశాన్ని ఆమె అభిమానులకు కల్పించబోతోంది. ఇప్పటివరకు చేసిన మంచి పనుల వివరాలు, వాటి తాలూకు ఫొటోలు పోస్ట్ చేయాలని ఆమె తన అభిమానులను కోరింది. ఇతరుల జీవితాలలో వెలుగు నింపాలనే శ్రుతి ఎప్పుడూ భావిస్తుందని, అందుకే ఈసారి తన పుట్టినరోజు నాడు అభిమానులతో సమయం పంచుకోవాలని అనుకుంటోందని ఆమెకు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మొత్తం వచ్చిన ఎంట్రీలలోంచి తనకు బాగా నచ్చిన ఐదింటిని శ్రుతి ఎంచుకుంటుందని, వాళ్లకు సొంత ఆటోగ్రాఫ్తో కూడిన బహుమతి, ప్రత్యేక సందేశం పంపుతుందని చెప్పారు. అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకోవడమే అతిపెద్ద బహుమతి అన్న విషయాన్ని శ్రుతి నమ్ముతుందన్నారు. అందుకే తన పుట్టినరోజు నాడు అభిమానులు తనకు మంచి బహుమతిని ఈ రూపంలో ఇవ్వాలని కోరుతోందన్న మాట. ప్రస్తుతం శ్రుతిహాసన్ చేతిలో రాకీ హ్యాండ్సమ్, వెల్కం బ్యాక్, మై గబ్బర్, యారా, పులి సినిమాలతో పాటు మహేశ్ బాబు సరసన ఇంకాపేరుపెట్టని మరో సినిమా కూడా ఉంది.
.
.