ఫస్ట్ వేవ్ లో తప్పించుకున్నా.. సెకండ్ వేవ్ లో అక్షయ్ కు కరోనా సోకింది. తనకు కరోనా సోకిన విషయాన్ని అక్షయ్ ట్విట్టర్లో ప్రకటించాడు. ఈరోజు ఉదయాన్నే తనకు కరోనా వచ్చినట్టు తెలిసిందని, వెంటనే తను హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని అక్షయ్ కుమార్ ప్రకటించాడు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని, తనను ఇటీవల కాలంలో కలసినవారంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు అక్షయ్.
లాక్ డౌన్ టైమ్ లో పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అక్షయ్ కుమార్. కరోనా నివారణ చర్యల కోసం ప్రధాన మంత్రి సహాయ నిధికి భారీ విరాళం కూడా ప్రకటించాడు. అంతేకాదు.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత విదేశాల్లో షూటింగ్ చేసిన తొలి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. తను నటిస్తున్న బెల్ బాటమ్ సినిమా షెడ్యూల్ ను లండన్ లో స్టార్ట్ చేసి అందరికీ షాకిచ్చాడు.
53 ఏళ్ల అక్షయ్ కుమార్ కరోనా బారిన పడినా.. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని అంటున్నాడు. తగిన జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకిందని, ప్రజలంతా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నాడు. అందరూ కలసికట్టుగా మహమ్మారిపై పోరాటం చేయాలని, వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి అంటున్నాడు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించాడు అక్షయ్ కుమార్. మొత్తమ్మీద బాలీవుడ్ నటులు కూడా సెకండ్ వేవ్ బారినపడ్డారని తెలుస్తోంది. అయితే ఈసారి షూటింగ్ లకు ఎక్కడా బ్రేక్ రాకపోవడమే కాస్త మంచి పరిణామం.