ప్రభుత్వం బంద్ ప్రకటించకపోయినా, థియేటర్లు స్వచ్ఛధంగా బంద్ పాటించేలా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయమే అని తెలుస్తోంది. వకీల్ సాబ్ మినహా ప్రస్తుతానికి మరో సినిమా ఏదీ థియేటర్ లో లేదు. ఏదో ఒక సినిమా వేసినా కరెంట్ ఖర్చులు కూడా వచ్చేలా లేవు. అందుకే నష్టానికి థియేటర్లు నడపడం ఇష్టంలేని యజమానులు స్వచ్ఛందంగా వాటిని మూసేస్తారని అంటున్నారు.
అన్ లాక్ నిబంధనల్లో భాగంగా గతంలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా చాలామంది వెనకడుగేశారు. ఖర్చులు రావనే ఆలోచనతో సినిమాలు వేయలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నిబంధనలు లేకపోయినా.. సినిమాలు లేకపోవడంతో థియేటర్ల యజమానులు భయపడుతున్నారు.
ఇక్కడ నిర్మాతల్ని కూడా తప్పుబట్టలేం. ప్రభుత్వాలు, ఎప్పుడు సడన్ గా లాక్ డౌన్ అంటాయోననే అనుమానంతో నిర్మాతలు వెనకడుగు వేశారు. సడన్ గా లాక్ డౌన్ అంటే సినిమాలు ఎటూ కాకుండా పోతాయి. అటు ఓటీటీల ఆఫర్లు కూడా ఉండవు. అందుకే నిర్మాతలు భయపడుతున్నారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత సినిమాలు విడుదల చేద్దామనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కలెక్షన్లు మెల్ల మెల్లగా తగ్గిన తర్వాత, ఏ సినిమా వేయాలనే విషయంపైనే థియేటర్ల ఓనర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త సినిమాలు లేకపోతే, థియేటర్లు మూసేసుకోవాల్సిందే, ప్రత్యామ్నాయం లేదు.