టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి నుండి ఏదైనా సినిమా వస్తుంది అంటే దానిపై ఆడియన్స్ లో విపరీతంగా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల ప్రభాస్ తో ఆయన తీసిన బాహుబలి రెండు భాగాల సినిమాల గొప్ప విజయాల తరువాత దర్శకుడిగా రాజమౌళి స్థాయి, క్రేజ్, మార్కెట్ తారా స్థాయికి చేరింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రాం చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అలియా భట్, ఒలివియ మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ శరణ్, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

పలువురు హాలీవుడ్ నటులు కూడా ముఖ్య పాత్ర,లు చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల చరణ్, ఎన్టీఆర్ ల పాత్ర ల యొక్క ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకుని ఇప్పటివరకు సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈపాటికె పూర్తి కావాల్సి ఉండగా మధ్యలో కొన్ని కారణాల వలన చివరిదశలో ఆగిందని అంటున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విలయతాండవం చేస్తుండడంతో ఆర్ఆర్ఆర్ షూట్ ని చివర్లో ఆపేశారని సమాచారం.

అయితే మరొక వార్త ప్రకారం ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుందని, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుకనున్నాయని టాక్. అయితే వీటిలో ఏది నిజం అనేది తెలియాల్సి ఉందని, లోగుట్టు పెరుమళ్లకెరుక అనే విధంగా అసలు ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ నిజంగానే పూర్తి అయిందా, అలానే ముందుగా అనుకున్న విధంగా అక్టోబర్ 13 న సినిమా విడుదల అవుతుందా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే ఆర్ఆర్ఆర్ యూనిట్ దీనిపై అధికారికంగా స్పందించాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: