సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖుల ప్రాణాలను బలిగొంటున్న మహమ్మారి నుంచి బయట పడే సూచనలు అస్సలు కనిపించడం లేదు. ప్రపంచంలో ఏ దేశంలో నమోదుకాని రీతిలో భారతదేశంలో ప్రతిరోజు 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
ఆక్సిజన్ అందక చాలా మంది ఒకేసారి చనిపోతున్నారు. రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో
ఆక్సిజన్ కొరతతో పాటు కరోనా
డ్రగ్స్ కొరత కూడా ఏర్పడుతుంది. 136 కోట్ల
జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది అయిదారు నెలల్లో జరుగుతుందని అనుకోవడం అవివేకమని ప్రముఖ వైద్యులు కూడా చెబుతున్నారు. దీంతో కరోనా మహమ్మారితో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం ఏమరుపాటుగా వహించినా వైరస్ సంక్రమిస్తూ ప్రాణాలను తీసేస్తోంది.
మహమ్మారి కారణంగా పేద మధ్య తరగతి ప్రజలు సరైన సమయానికి సహాయం అందక నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి
టాలీవుడ్ హీరోలు ఎందుకు ముందుకు రారు? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మౌన ప్రేక్షకపాత్ర వహించడం తప్ప వారి చేసేదేమీ లేదా? అని
కాంగ్రెస్ నేత
అద్దంకి దయాకర్ సంచలన ప్రశ్నలు సంధించారు. కేవలం సినిమాల్లో ప్రజల్ని కాపాడటం తప్ప నిజ జీవితంలో
సినిమా హీరోలు ఒక్కరిని కూడా కాపాడలేరు. అసలు వాళ్ళకి అసలైన హీరోయిజం అంటే ఏంటో కూడా తెలీదు అని దయాకర్ అసహనం వ్యక్తం చేశారు.
"హీరోలకి రాజకీయ నేతలతో అనుబంధాలు ఉండచ్చు. లేదా వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలు ఇష్టం ఉండొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులలో మౌనంగా ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదు. పేదలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీయాలి లేదా స్వచ్ఛందంగా వారే ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయాలి. మీరు మౌనంగా ఉండటం పరిష్కారం కాదు.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ని చూడండి. ఆయన భారతదేశానికి మాత్రమే
హీరో కాలేదు ప్రపంచం మొత్తం అతన్ని పొగుడుతోంది.
హీరో సిద్ధార్థ్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ ప్రజలు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
టాలీవుడ్ నటులను ప్రజలే హీరోలు చేశారు. కానీ ప్రజల కోసం వారు ఏమి చేయడం లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.