టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ గా వచ్చిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఉదాహరణకు ఆర్య చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 సినిమా అంతగా ప్రేక్షకుల్ని అలరించలేదు. నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దానికి సీక్వెల్ గా వచ్చిన మన్మధుడు 2 చిత్రం డిజాస్టర్ అయ్యింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సూపర్ హిట్టయితే శంకర్ దాదా జిందాబాద్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఇలా చెప్పుకుంటూపోతే కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సీక్వెల్ మూవీలన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి. తమిళంలో లారెన్స్ తెరకెక్కించిన ముని, కాంచన చిత్రాలు సక్సెస్ అయ్యాయి కానీ తెలుగులో సీక్వెల్ సినిమాతో ఎవరూ కూడా హిట్స్ సంపాదించ లేకపోయారు. కానీ సీక్వెల్ సినిమాలు చేయడం మాత్రం తెలుగు సినిమా వాళ్లు ఆపలేదు సరికదా.. ఇంకా పెంచేశారు. బంగార్రాజు, డి&ఢీ డబుల్ డోస్, కార్తికేయ-2, గూడచారి-2, విశ్వక్‌సేన్ హిట్-2, ఎఫ్-3 సీక్వెల్స్ తెలుగులో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అవి కాకుండా మరొక 3 సినిమాల సీక్వెల్స్ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
1. జాతి రత్నాలు 2:
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఖాళీగా తిరిగే ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ హైదరాబాద్ కి వెళ్లి ఎలాంటి అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటారో జాతిరత్నాలు సినిమాలో చాలా ఫన్నీగా దర్శకుడు అనుదీప్ కె.వి చూపించారు. అయితే జాతి రత్నాలు 2 సినిమాలో ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ మళ్లీ కలుసుకుంటారని.. అమెరికా వెళతారని.. అక్కడ వారు అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటారని.. ఇలాంటి సన్నివేశాలతో జాతిరత్నాలు 2 సినిమాని నాగ్ అశ్విన్, అనుదీప్ ప్లాన్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.
2. జాంబీ రెడ్డి 2:
టాలీవుడ్ లో జాంబీ జానర్ లో మొదటిసారిగా వచ్చిన జాంబీ రెడ్డి మూవీకి కూడా ఇప్పుడు సీక్వెల్ సినిమా రానుంది. జాంబీ రెడ్డి 2 టైటిల్ తో రానున్న సీక్వెల్ కి కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే జాంబీ రెడ్డి సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక సరికొత్త ఫీలింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి సీక్వెల్ తో ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఇంకెంతగా అలరిస్తారో చూడాలి.
3. దృశ్యం 2:
దృశ్యం సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జీతూ జోసెఫ్ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను రూపొందించారని తెలుస్తోంది. ఒక ఉత్కంఠభరితమైన చిత్రంగా దృశ్యం సినిమా ఉండనుందని తెలుస్తోంది. అందుకే తెలుగులో వస్తున్న ఉత్తమ సీక్వెల్ సినిమాల్లో దృశ్యం 2 ఒకటిగా నిలుస్తోంది.