స్వర రాజశేఖరుడు పి.ఆదినారాయణరావు తన సంగీతంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. అప్పట్లో సరైన టెక్నాలజీ ఉన్నట్లయితే ఆయన స్వరపరచిన పాటలు వేరే లెవల్ లో ఉండేవేమో. అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన "అనార్కలి" సినిమాలో ఆయన "రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా" పాట ఎంత గొప్పగా స్వరపరిచారో వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. అంజలీదేవి కదలికలకు పర్ఫెక్ట్ గా సంగీతం అందించి అద్భుతాలు సృష్టించిన ఆదినారాయణరావు.. ఇదే సినిమాలో "జీవితమే సఫలము" పాటకు కూడా చక్కటి సంగీత బాణీలు సమకూర్చారు.

భారతీయ సంప్రదాయ సంగీతాన్ని సినిమా శైలికి అనుగుణంగా మార్చిన ఆదినారాయణ రావు.. ఏఎన్ఆర్ హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లోని పాటలను అత్యంత మధురంగా మలిచారు. సామాన్యులను, అలాగే సంగీత ప్రియులను కూడా తన సంగీతంతో మంత్రముగ్ధుల్ని చేశారు ఆదినారాయణరావు. సువర్ణ సుందరి సినిమాలో ఆయన అందించిన సంగీతం శ్రోతల మనసులను నేరుగా తాకిందని చెప్పుకోవచ్చు. "పిలువకురా అలుగకురా" పాటకు సముద్రాల సీనియర్ సాహిత్యం అందించగా పి.సుశీల ఆలపించారు. ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది.

భక్తిరస చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల హృదయాలను రంజింప చేసింది. నాగేశ్వర రావు, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో నటించిన భక్తతుకారం సినిమాలోని "ఘనాఘన సుందరా" పాటను ప్రతిరోజు ఉదయాన్నే వినే తెలుగు వారు కోకొల్లలు. యూట్యూబ్ లో ఈ పాటకు కోటి 30 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గానామృతానికి చెవికింపైన, శ్రావ్యమైన సంగీతం జోడించి "ఘనాఘన సుందరా" పాటను ఒక మాస్టర్ పీస్ గా ఆదినారాయణరావు మలిచారు. భక్తుల హృదయాలను పరవశింప చేసిన పాటలలో ఘనాఘన సుందరా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. నాగేశ్వరరావు నటించిన మహాకవి క్షేత్రయ్య సినిమాకి కూడా ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: