ఇక ప్రత్యేకంగా హ.. హ.. హాసిని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా ముందు వరకు జెనిలియా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా బొమ్మరిల్లు తర్వాత మహానటి అనిపించేసుకుంది. హాసిని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జెనిలియా చూపించిన అభినయం అందరిని మెప్పించింది. చిలిపితనం, గడుసుతనం, అల్లరితనం అన్ని హాసిని పాత్రలో ఉన్నాయి. వాటిని ఏమాత్రం మిస్ అవకుండా అభినయించి అందరి చేత ప్రశంసలు అందుకుంది జెనిలియా. అంతేకాదు ఆ టైం లో హాసిని లాంటి క్యారక్టర్ ఉన్న అమ్మాయిల వెంట కుర్రాళ్లు పడ్డారనుకోండి.
హాసిని పాత్రతో బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు ప్రాణం పోశారు. కేవలం ఓ తండ్రి కొడుకు కథని మాత్రమే చెబితే సినిమా ఎలా ఉండేదో కాని సినిమాలో ఓ ప్రేమ కథ అందులో హాసిని లాంటి అమ్మాయి పాత్ర పెట్టి తనతోనే సినిమా మొత్తం నడిపించాడు. జెనిలియా నటనకు దూరంగా ఉంటున్నా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి హాసిని అంటే జెనిలియానే గుర్తుకొస్తుంది. సిద్ధార్థ్, జెనిలియాల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. జెనిలియా నటనకు ప్రత్యేక ప్రశంసలు అందాయి. తెలుగులో హిట్టైన ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. హిందీలో కూడా ఫీమేల్ లీడ్ రోల్ గా జెనిలియా నటించడం విశేషం.