అలనాటి సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రాజబాబు. అలనాటి సినిమాలలో రమాప్రభ కు జోడిగా రాజబాబు నటించి హాస్యాన్ని పండించేవారు. రాజబాబు సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన తర్వాత టీచర్ కోర్సు కి కావలసిన శిక్షణను కూడా తీసుకున్నాడు. ఆ తరువాత ఉపాధ్యాయ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన , కొద్ది రోజుల పాటు తెలుగు పండితుడిగా పనిచేశాడు. ఆయనకు నాటకాలలో ఉండే మక్కువ కారణంగా తెలుగు ఉపాధ్యాయుడిగా ఉన్న సమయంలోనే అల్లూరి సీతారామరాజు, కుక్కపిల్ల దొరికింది లాంటి నాటకాలలో నటించాడు.
రాజబాబు హాస్యనటుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి, ఆ తరువాత దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించడం జరిగింది. రాజబాబు రియల్ లైఫ్ లో ఎంతో మందికి ఎన్నో సేవలు చేశారు. అడిగినవారికి లేదనకుండా, కష్టం వచ్చిన వారికి కాదనకుండా తన వంతు సహాయంగా, అందరికీ సహాయం చేస్తూ అండగా నిలిచే వారు. ఈయన ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు కానుకగా ముఖ్యంగా ఆ కాలంలో గొప్ప నటీనటులకు గౌరవంగా సత్కరించేవారు కూడా. అలా ప్రతి సంవత్సరం ఈయన సత్కరించిన వారిలో శివరామకృష్ణ, సూర్యకాంతం, బాలకృష్ణ , రేలంగి, సావిత్రి మొదలగు ఎంతో మంది గొప్ప ప్రముఖులు ఉండడం విశేషం.
అలాగే విపత్కర పరిస్థితులలో నష్టపోయిన ఎన్నో సంస్థలకు అండగా నిలిచారు. ఆయన సంపాదించిన డబ్బులో కొన్ని కోట్ల రూపాయలను ఆర్థికంగా నష్టపోయిన సంస్థలకు విరాళంగా ప్రకటించేవారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, రాజమండ్రిలో చెత్తాచెదారాన్ని శుభ్రపరిచే కార్మికులకు , అక్కడే వున్న దానవాయిపేటలోని ఆయన పొలాలను వారికి జీవనార్థం కొరకు రాసిచ్చారు. ఇక ఆయన జన్మించిన స్థలం అయిన కోరుకొండలో "రాజబాబు జూనియర్ కళాశాల" అనే ఒక కాలేజీని తన పేరు మీద కట్టించి ఎంతో మంది విద్యార్థులకు ఇప్పటికీ ఉచితంగా విద్యను అందించడం గమనార్హం. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ తన దయనీయతను చాటుకున్నారు రాజబాబు.
ఇక రాజా బాబు సినీ జీవితం విషయానికి వస్తే , ఆయన నటించిన ఎన్నో చిత్రాలకు గాను తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక శతాబ్దపు హాస్య నటుడిగా కూడా అవార్డు పొందారు. గొప్ప మహానుభావుడిగా పేరొందిన రాజబాబు ఫిబ్రవరి - 14 -1983లో గొంతు సమస్యతో బాధపడుతూ చికిత్స విఫలించి స్వర్గస్తులయ్యారు.