
కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో టాప్ హీరోలు అంతా షూటింగ్ ల బాట పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు సంబంధించి తాను నటించబోయే సీన్స్ విషయమై రాజమౌళి వద్ద క్లాసులు తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి జూనియర్ చరణ్ లు నటించవలసిన సీన్స్ షూటింగ్ జూలై నెలాఖరుకు పూర్తి అవుతాయి కాబట్టి ఆగష్టు నుండి జూనియర్ రాజమౌళి బంధిఖానా నుండి విముక్తుడవుతాడు.
దీనికి తగ్గట్టుగా జూనియర్ కొరటాల తో చేయబోతున్న మూవీ షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభిస్తూ దానితో పాటే జూనియర్ హోస్ట్ చేయబోతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో కోసం తారక్ డ్రెస్ రిహార్సల్స్ పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షోకి సంబంధించి జూనియర్ తో పలురకాల డ్రెస్ లు మార్చి ఈమధ్య ఒక ఫోటో సెషన్ చేసారు అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఫైనల్ గెటప్ ఇంకా ఫిక్స్ కాలేదని దీనికోసం అనేకమంది స్టైలిస్ట్ లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇప్పుడు లీక్ అవుతున్న వార్తల ప్రకారం ఈషో షూటింగ్ ఆగష్టు చివరి వారంలో మొదలై సెప్టెంబర్ లో వచ్చే వినాయకచవితి రోజు నుండి ఈషో ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేసాడని తెలుస్తోంది. ‘అరవిందసమేత’ తరువాత జూనియర్ నుండి సినిమా వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోవడంతో అభిమానులు జూనియర్ సినిమాల గురించి విపరీతంగా ఎదురు చూస్తున్నారు.
‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవ్వడానికి ఇంకా చాల సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో బుల్లితెర పై ఒక డిఫరెంట్ గెటప్ తో కనిపించబోయే జూనియర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు అత్యంత భారీ రేటింగ్స్ రావడం ఖాయం. ఈ క్రేజ్ వల్లనే ఈ షో నిర్వాహకులు జూనియర్ కు అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేసారు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వినాయకచవితి నుండి బుల్లితెర పై జూనియర్ హంగామా ఖాయం అనుకోవాలి..