విజయ్ సాయి.. పొట్టి విజయ్ గా సినిమా రంగంలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. విభిన్న దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు. దెబ్యూ సినిమాతో ఆయన సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. బ్యాక్‌పాకెట్, ఒకరికొకరు, భగీరథ, సోగ్గాడు, వరప్రసాద్ పొట్టి ప్రసాద్, బొమ్మరిల్లు, కొంటె కుర్రాళ్ళు, పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఆయన కామెడీ పాత్రలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
అయితే అతనికి ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ కమెడియన్‌గా నిలదొక్కుకోలేకపోయారు. ఇందుకు కుటుంబ కలహాలే కారణమని సినీ జర్నలిస్టులు అంటుంటారు. కుటుంబ వివాదాల కారణంగానే ఆయన 2017 డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2006వ సంవత్సరంలో బుల్లితెర నటీమణి వనిత రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. కానీ 2015 సంవత్సరం నుంచి తన భార్యకు దూరంగా ఒంటరిగా నివసించారు. గృహ హింస చట్టం కింద విజయ్ సాయి భార్య కేసు పెట్టి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారని తండ్రి కె.వి సుబ్బారావు వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ ఆమె రూ. 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ సమస్యలతోనే విజయ్ సాయి కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని సన్నిహితులు భావిస్తుంటారు.
విజయ్ సాయి చక్కని నటనతో తన ఫన్నీ డైలాగ్ డెలివరీతో సినీ విమర్శకులను సైతం మెప్పించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితర హాస్యనటుల వలే ఆయన అనేక సినీ అవకాశాలు అందుకోలేక పోయారు. కెరీర్ తొలినాళ్లలో తెలుగు ఇండస్ట్రీ లో బెస్ట్ కామెడీగా రాణించిన విజయ్ సాయి ఆ తర్వాత కెరీర్ పరంగా పతనం అయ్యారు. ఏదేమైనా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతిభావంతుడైన ఓ మంచి హాస్యనటుడి ని కోల్పోయింది.