టాలీవుడ్‌ నుంచి మొదలుపెడితే బాలీవుడ్‌ వరకు ఎక్కడ చూసినా మళయాళం కథలు కనిపిస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోలు కూడా  మళయాళీ స్టోరీలను రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుపెడితే తేజ సజ్జా వరకు చాలామంది హీరోలు మళయాళీ కథలని సూపర్‌హిట్స్‌కి షార్ట్‌కట్‌లా చూస్తున్నారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లూసిఫర్'ని చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా.

పవన్ కళ్యాణ్‌  ప్రత్యేక శ్రద్ధతో చేస్తోన్న రీమేక్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'. బిజూ మీనన్, పృథ్వీరాజ్ లీడ్‌రోల్స్‌ ప్లే చేసిన ఈ మళయాళీ కథలో పవన్‌, రానా నటిస్తున్నారు. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదట ఈ మూవీలో బాలకృష్ణ, రవితేజ లాంటి వాళ్లు నటిస్తారనే ప్రచారం జరిగినా ఫైనల్‌గా పవన్‌ కళ్యాణ్‌ దగ్గరికి వెళ్లింది ఈ కథ.

రీమేక్‌ సినిమాలతో సూపర్ హిట్స్‌ కొడుతోన్న వెంకటేశ్‌ 'దృశ్యం2' రీమేక్‌ చేస్తున్నాడు. ఇక సిద్ధు జొన్నలగడ్డ మళయాళీ హిట్‌ 'కప్పేల' రీమేక్‌లో నటిస్తున్నాడు. తేజ సజ్జా 'ఇష్క్' రీమేక్‌ చేస్తున్నాడు. వీటితోపాటు 'హెలెన్'ని కూడా తెలుగులో రీమేక్‌ చెయ్యబోతున్నారు. అయితే మళయాళీ కథలకి బయట మార్కెట్స్‌లో ఇంత డిమాండ్‌ ఉన్నా, వసూళ్లు మాత్రం ఆ రేంజ్‌లో రావడం లేదు.

దక్షిణాదిన తెలుగు, తమిళ్‌ సినిమాలు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నాయి. టాప్‌ హీరోలకి వందకోట్లు అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ మళయాళీ స్టార్స్‌ ఇంకా 50 కోట్లు దాటడమే కష్టమవుతోంది. మల్లూ స్టార్లు ఓటీటీలతో ఇండియన్‌ వైడ్‌గా మెప్పిస్తున్నా, థియేటర్‌ బిజినెస్‌లో మాత్రం నిలబడలేకపోతున్నారు. ఇంతకముందు మళయాళీ సినిమాలని ఆడియన్స్ పెద్దగా చూసేవాళ్లు కాదు. తెలుగులో అయితే మళయాళీ సినిమాలు అనగానే షకీలా సినిమాలు అనే ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మళయాళీ కథలని క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్‌లా చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: