ఆన్లైన్ పోర్టల్లో టిక్కెట్లు అమ్మితే బ్లాక్ టిక్కెట్ల దందాకు పూర్తిగా చెక్ పడుతుంది. అసలే ఏపీలో టిక్కెట్ల రేట్లు ప్రభుత్వం చాలా వరకు తగ్గించేసింది. ఇప్పటి వరకు బెనిఫిట్ షో లతో స్టార్ట్ చేసి ప్రతి షోకు టిక్కెట్ రేట్లు ఇష్టమొచ్చినట్టు పెంచుకుంటూ ప్రేక్షకుడిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. బెనిఫిట్ షోల టిక్కెట్ రేట్లు అయితే స్టార్ హీరోల సినిమాలకు రు. 1500 కు పైన కూడా ఒక్కోసారి పలుకుతోంది. ఇక సినిమా బాగుందని టాక్ వస్తే టిక్కెట్లు బ్లాక్ చేసి కావాలనే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు ఎన్ని షోలు వేసుకున్నా.. టిక్కెట్ రేట్లు ఎంతకు అమ్ముకున్నా అడిగే వారు లేరు.
ఇక జగన్‌కు ఇండస్ట్రీ మీద ఉన్న కోపం నేపథ్యంలో ఇదే టార్గెట్ గా ఇండస్ట్రీని టార్గెట్ చేసే ప్రక్రియలు అన్ని స్పీడ్ అవుతున్నాయి. ఆన్‌లైన్ పోర్టల్ వల్ల అకౌంటబులిటీ రావాలన్నదే సీఎం ఆలోచన. పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్ పెడుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెపుతున్నారు. తన ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదని వారు చెపుతున్నారు. ఇప్పటికే తగ్గించిన రేట్లతో పాటు షోలు తగ్గించేయడం.. ఇక టిక్కెట్లను కూడా ప్రభుత్వమే అమ్మి.. నెలకో.. రెండు నెలలకో డబ్బులు ఇస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి మొదలు పెట్టి ఎవ్వరికి డబ్బులు రావు. అటు స్టార్ హీరోలకు రెమ్యునరేషన్లు కూడా రావు. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు గగ్గోలు పెడుతోంది.