
కరోనా పరిస్థితులు మొదలైనప్పటి నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏర్పడిన కష్టాలు నష్టాలు ఎప్పటికి తొలిగిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. రిలీజ్ కు రెడీగా ఉన్న పెద్ద సినిమాలు టిక్కెట్ల రెట్ల పెంపు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నాయి. ఈ పెద్ద సినిమాలు పక్కకు పెడితే ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న చిన్న సినిమాలు సుమారు 100 పైన ఉంటాయి అని అంటున్నారు.
గతంలో దాసరి నారాయణరావు జీవించి ఉన్న రోజులలో చిన్న సినిమాల కష్టాల గురించి ఆయన పట్టించుకునేవారు. దాసరి మరణం తరువాత ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడే వ్యక్తి కూడ లేడు. కేవలం ఇండస్ట్రీ ప్రముఖులు అంతా పెద్ద సినిమాల సమస్యలు గురించి టిక్కెట్ల రేట్ల పెంపు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను కలవడానికి వెళుతున్న ప్రముఖుల లిస్టులో కనీసం ఒక్క చిన్న నిర్మాత కూడ ఉండక పోవడంతో చిన్న నిర్మాతలు దేనికీ పనికిరారా అన్న నిరాశ నిస్పృహ కలుగుతున్నాయి.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో చిన్న సినిమాలు తీసే నిర్మాతలు ఇక ఉండరనీ అలాంటి పరిస్థితులలో చిన్నచిన్న నటీనటులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇచ్చేవారు లేక ఇండస్ట్రీలో 70 శాతం మందికి పని దొరకకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. మాటలలో చిన్న సినిమాల గురించి అందరు మాట్లాడుతున్నా వాటి కష్టాల గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి చాల దయనీయంగా మారుతోందా అన్న సందేహాలు అందరికీ కల్గుతున్నాయి.
వాస్తవానికి పరిస్థితులు పెద్ద సినిమా నిర్మాతలకు కూడ పెద్దగా అనుకూలంగా ఉన్న స్థితి కనిపించడంలేదు. టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ కలక్షన్స్ ను పరిశీలిస్తూ ఉంటే ఈమూవీ బయ్యర్లకు కేవలం బ్రేక్ ఈవెన్ వస్తుంది కాని చెప్పుకోతగ్గ లాభాలు ఉండవు అన్న మాటలు వినిపిస్తున్నాయి..