తెలుగు సినిమాలతో కాస్తో , కూస్తో పరిచయం ఉన్నవ్యక్తులు ఈ ప్రశ్నకు ఠక్కున సమాధానం చెబుతారు.  అది అందరికీ తెలిసిన సమాధానమే కదా? అని మరీ ప్రశ్నిస్తారు. నిజమే కదా!  సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిందిగా ? అని కూడా అడుగుతారు. అందురూ చెప్పే సమాధానం.. సిరివెన్నెల...1986లో విడుదలయిన దృశ్యకావ్యం. ఇది. కానీ ఆ సినిమా సీతారామ శాస్త్రి తొలి సినిమా కాదు.  ఆయన తొలి దర్శకుడు మాత్రం  కళాతపస్వి కె. విశ్వనాథ్.
సీతారామ శాస్త్రి తొలి సినిమా కళాతపస్వి కే విశ్వనాథ్ సినిమానే. కాక పోతే ఆయన తొలి చిత్రం సిరి వెన్నెల మాత్రం కాదు. విశ్వనాథ్  దర్శకత్వంలో రూపు దిద్దుకున్న జననీ జన్మభూమి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సత్యరావు మాస్టారు అనే  మిత్రుడు సీతారామ శాస్త్రిని సినీదర్శకుడు కే విశ్వనాథ్ కు పరిచయం చేశారు. జననీ జన్మ భూమి సినిమాలో  సిరివెన్నెల రచించిన గంగావతరణం ను విశ్వనాథ్ చూడడం జరిగింది. దీంతో సీతారామ శాస్త్రికి  జననీ జన్మభూమి సినిమాలో   అవకాశం కల్పించారు విశ్వనాథ్. ఒక్క పాట తప్ప జననీ జన్మభూమి సినిమాలో పాటలన్నింటినీ దివంగత వేటూరి సుందర రామ మూర్తి రాశారు.   ఆ సినిమాలోని
తడిసిన అందాలలో
తనువుల ఉయ్యాలలో
నవ్వనీ యవ్వనం... ఈ క్షణం
అనే పల్లవితో సాగే పాటను మాత్రం సీతారామ శాస్త్రి రచించారు. ఈ  సినీ నేపథ్య గీతానికి  దక్షిణ భారత దేశంలో విఖ్యాత సంగీత దర్శకుడు కేవి మహదేవన్ స్వర పర్చగా,  మాధవ పెద్ది  రమేష్, సుశీల గానం చేశారు. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లో చిత్రికరించిన సాంగ్.  
సీతారామ శాస్త్రికి తన పేరంటే పెద్దగా ఇష్టం లేదు.  సినీ రంగానికి పరిచయం కాక ముందు చేసిన రచనలన్నీంటికీ ఆయన కలం పేరుతోనే రాశారు.  ఆయన కలం పేరు భరణి. దర్శకుడు విశ్వనాథ్ కు పరిచయం అయిన సమయంలోనూ సీతారామ శాస్త్రిని భరణి గానే పరిచయం చేశారు. కొద్ది రోజుల తరవాత కానీ  విశ్వనాథ్ కు ఆయన అసలు పేరు తెలియదు.  ఆ తరువాత  కే విశ్వనాథ్ కు ఆయన పేరు సీతారామ శాస్త్రి అన్న విషయం తెలిసింది. దీంతో విశ్వనాథ్ సీతారామ శాస్త్రిని సున్నితంగా  మందలించారు. తల్లితండ్రులు శాస్త్రోక్తంగా పెట్టిన పేరు లక్షణంగా ఉండగా.. కలం పేరు ఎందుకని  ప్రశ్నించారు. దీంతో  ఆయన తనపేరును సీతారామ శాస్త్రీగానే  కొనసాగించారు.సినీ అభిమానులు ఆయన ఇంటిపేరు చేంబోలు ను కాస్తా సిరివెన్నెల గా మర్చేశారు.  నాటి నుంచి ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా  ప్రజల మనసుల్లో ఒకరుగా నిలిచిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: