ఇక ఆ తరువాత బిగ్ బాస్ సీజన్3 నుంచి అక్కినేని నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇటీవల నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందేంటంటే.. నాగార్జున వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకోనున్నారు. ఆదివారం జరిగిన షోకు గెస్ట్‌గా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అయితే కోట్ల సంఖ్యలో మొక్కలను నాటించాలని సంతోష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
అంతేకాదు.. రేపటి ప్రగతికి పచ్చదనమే పథమని ఆయన వెల్లడించారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి సంతోష్ కుమార్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలై మూడు సంవత్సరాలు పూర్తైందని చెబుతూ బిగ్ బాస్ హౌస్‌లో నాటాలని ఒక మొక్కను నాగార్జునకు అందజేశారు. ఇక గడిచిన మూడు సంవత్సరాలలో 16 కోట్ల మొక్కలను నాటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభాస్ 1650 ఎకరాలను దత్తత తీసుకున్నారని సంతోష్ కుమార్ వెల్లడించారు. అయితే నాగార్జున తాను కూడా అడవులను దత్తత తీసుకుంటానని తెలిపారు. అంతేకాదు.. సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ 1,000 ఎకరాలను దత్తత తీసుకుంటానని నాగార్జున చెప్పుకొచ్చారు.