రెమ్యునరేషన్ వదులుకోవడంతో
నానీ ఇప్పుడు ఇండస్ట్రీకే ఓ ఆదర్శం అయి నిలిచారు.
సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడం వేరు.. ఓ సినిమానే పూర్తిగా జనంలోకి తీసుకువెళ్లేందుకు తన రెమ్యునరేషన్ ను సైతం వదులుకోవడం వేరు. గత సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కూడా థియేట్రికల్ రిలీజ్ కు నానీ మొదట్నుంచీ మొగ్గు చూపి అందుకు తగ్గ ఏర్పాటు చేశాడు. దీంతో సినిమా ఇప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంది అని తెలుస్తోంది. నానీ తీసుకున్న చొరవ కారణంగా సినిమాకు ఇప్పుడు కాస్త థియేటర్లు దొరుకున్నాయి కూడా! ఇక్కడే కాదు విదేశాల్లో కూడా శ్యామ్ సింగ రాయ్ కు మంచి టాక్ రావడంతో పెట్టిన డబ్బులు వెనక్కు వస్తే నానీ వదులుకున్న ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కు ఓ విలువ.
ఓ సార్థకత కూడా!
ఇవాళ రేపు సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సినిమా తీయడం, విడుదల చేయడం మధ్య ఎన్నో ఆటుపోట్లు వచ్చి ముంచెత్తుతున్నాయి. వాటిని దాటుకుని సినిమా అన్నది బతికి నిలదొక్కుకుంటే చాలు అన్న ఓ చిన్న ఆశ ఇవాళ ఇండస్ట్రీని నడిపిస్తోంది.ఆ ఆశ కూడా లేకపోతే రాణించడం కానీ ఓ సినిమా తన ఉనికిని చాటుకోవడం కానీ ఊహకే అతీతం.కష్ట సాధ్యం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హీరో నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా విడుదలపై మొదట్లో ఎన్నో అపోహలు రేగాయి. సినిమా విడుదల పై సంశయాలు రేగాయి. సందిగ్ధతలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా ఓటీటీకే వెళ్లిపోనుందని, నానీ గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా నడవడం కష్టమేనని అంటూ చాలా రూమర్లు వచ్చాయి. ఆఖరికి ఈ సినిమా విడుదలకు నానీ యే సహకరించాడని టాక్. తనకు చెల్లించిన రెమ్యునరేషన్ లో ఐదు కోట్ల రూపాయలను వెనక్కు ఇచ్చి నిర్మాతను ఆదుకుని సినిమా ను బతికేందుకు తనవంతు ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాడు. దీంతో సినిమా ఆంధ్రాలో చాలా చోట్ల విడుదలకు నోచుకుని కాస్తో కూస్తో డబ్బులు రాబట్టుకుంది. కలెక్షన్లు పెరిగితే సినిమాకు నిర్మాతకు ఓ డబుల్ పాజిటివ్ రిజల్ట్ అందిందనే నిర్థారించవచ్చు.
ఇక ఈ సినిమాకు అమెరికాలో మంచి టాక్ ఉందని తెలుస్తోంది. రెండో వారంలో థియేటర్ల సంఖ్య పెరిగేందుకు వీలుంది. ఇందుకు అక్కడ పంపిణీ వ్యవస్థ తగు ఏర్పాటు చేస్తోంది. పది నుంచి 12 థియేటర్లను పెంచేందుకు అక్కడ పంపిణీ వ్యవస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 200 థియేటర్లలో అమెరికా లో నడుస్తోంది. ఇప్పటిదాకా 4 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.