ఇక మొన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో పెద్దలుగా కొనసాగుతున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ మా ఎలక్షన్స్ తర్వాత ప్రస్తుతం మళ్లీ టాలీవుడ్ కి పెద్ద దిక్కు ఎవరూ అన్న చర్చ మొదలయింది. ఇలాంటి సమయంలోనే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారిపోయాయ్. టాలీవుడ్ కి పెద్దగా ఉండాలని అనుకోవడం లేదని.. అలాంటి బాధ్యత నాకు ఇష్టం లేదు అంటూ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా వివాదాల జోలికి పోవాలి అని అనుకోవడం లేదు అంటూ స్పష్టత ఇచ్చారు. కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి సహాయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ పెద్ద ఎవరు అన్నదానిపై మాత్రం ప్రస్తుతం మళ్ళీ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో ఆర్ఎక్స్100 సినిమా తో టాలీవుడ్లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను పెద్ద దిక్కు గా చూడాలి అనే సరికొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకు వచ్చాడు అజయ్ భూపతి. మా బాస్ ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలి.. అది చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామి అంటూ అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది.