నాగచైతన్య-సమంత జోడీకి టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్లిద్దరూ కలిసి చేసిన ఏమాయ చేశావె, మనం, ఆటోనగర్ సూర్య సినిమాలు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. బ్యూటీఫుల్ కపుల్‌గా ముద్ర వేశాయి. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఆ క్రేజ్ రెట్టింపు అయ్యింది. వారి జోడీ మరోసారి కలిసి నటించిన మజిలీ సినిమాతోనే ఆ సంగతి నిరూపితమైంది. అయితే అనూహ్యంగా చైతూ, సామ్ విడాకులు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వీరి మధ్య విభేదాలకు కారణమైన విషయమేంటో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులకు కారణం కొందరు సమంత అని విమర్శలు చేయగా... కొందరు చైతూ అంటూ ఆరోపణలు చేశారు.

అయితే వీరి విడాకులకు కారణం ఏదైనా.. కెరీర్‌లో నష్టపోతుంది, నష్టపోయేది సమంత అని అందరూ ఫిక్సయిపోయారు. ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా... ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. చివరకు నష్టం కలిగేది ఆకుకే అనే నానుడి మనకు తెలిసిందే. ఈ నానుడి సమంత విషయంలో అక్షరాలా నిజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత.. ముఖ్యంగా మన టాలీవుడ్‌ హీరోయిన్లు ఫ్యామిలీ పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. కొందరు కెరీర్ ఆపేసినా సినిమాల్లో నటించడం ఇష్టమున్న వాళ్లు కచ్చితంగా సంప్రదాయ పాత్రలనే ఎంచుకుంటారు. దీనికి సమంత కూడా అతీతమేమీ కాదు. పెళ్లయ్యాక మజిలీ, ఓ బేబీ, యూటర్న్, రాజు గారి గది 2 సినిమాల్లో నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలనే సామ్ ఎంచుకుంది. త్వరలో రానున్న శాకుంతలం సినిమా కూడా ఈ కోవకు చెందినదే. ఇక్కడి వరకు అంతా సాఫీగానే సాగింది.

తియ్యగా ఉన్న పాయసంలో ఒక్కవిషపు చుక్క మొత్తం పాయసాన్నే విషపూరితం చేసిన తరహాలో.. ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ సమంత కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడం అక్కినేని ఫ్యామిలీకి రుచించలేదనే ప్రచారం సాగుతోంది. దీంతో చైతూ, సామ్ మధ్య విభేదాలు వచ్చాయని... తనపై ఆంక్షలు విధించడం సమంతకు నచ్చలేదని.. అందుకే వీరిద్దరూ విడిపోయారని టాక్ నడిచింది. అయితే చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఐటం సాంగ్స్‌లో నటించడం.. స్నేహితులతో కలిసి బీచ్‌లకు వెళ్లి బికినీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తోంది. దీంతో సమంత కావాలనే ఇవన్నీ చేస్తుందని... కావాలనే కెరీర్‌ను మరో రకంగా ఎంచుకుని ఆ దారిలో పయనిస్తోందని పరిశ్రమకు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు సమంత నెగిటివ్ రోల్స్‌లో కనిపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వారు కామెంట్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి చైతూతో విడాకులు సామ్ కెరీర్‌ను మార్చేశాయనే ఊహాగానాలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: