రామాయ‌ణ‌, మ‌హాభారతాలు ఉత్త‌రాదిన జ‌రిగిన ఇతిహాస గాథ‌లు. ద‌క్షిణ భార‌తంలోని కొన్ని ప్రాంతాల‌తో కూడా కొంత‌వ‌ర‌కు ఇవి ముడిప‌డి ఉన్నాఅది చాలా ప‌రిమితం. ఇవి నిజంగా జ‌రిగాయ‌న్న‌దే హిందువుల విశ్వాసం. ఇందుకు చారిత్ర‌క ఆధారాల‌నూ చూపిస్తారు కొంద‌రు. అయితే ఈ పురాణ గాథ‌ల్ని వెండితెర‌పై అద్భుతంగా తెర‌కెక్కించింది మాత్రం ద‌క్షిణాది ద‌ర్శ‌కులే. ఆ పాత్ర‌ల‌ను అనిత‌రసాధ్యంగా పోషించిన ఘ‌న‌తా ద‌క్షిణాది న‌టీన‌టుల‌దే. ఇది నిర్వివాదాంశం. ద‌ర్శ‌క దిగ్గ‌జం కేవీ రెడ్డి తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కించిన మాయాబ‌జార్ చిత్రంలో కృష్ణుడిగా ఎన్టీఆర్‌, అభిమ‌న్యుడిగా ఏఎన్నార్‌, శ‌శిరేఖ‌గా సావిత్రి, ఘ‌టోత్క‌చుడిగా ఎస్వీఆర్ క‌న‌బ‌ర‌చిన అసాధార‌ణ న‌ట‌నా పాట‌వానికి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌ట్టారు. ఈ చిత్రం సాధించిన అఖండ విజ‌యం చూసి బాలీవుడ్‌లోనూ ఇదే క‌థ‌ను తెర‌కెక్కించినా ఈ చిత్రం ముందు అది చాలా పేల‌వంగా క‌నిపించింద‌ని అక్క‌డి సినీ పండితులే చెప్పిన‌మాట‌. ఒక‌ర‌కంగా ఈ చిత్రంతో ద‌క్షిణాదిన పౌరాణిక చిత్రాల స్వ‌ర్ణ‌యుగం ప్రారంభ‌మైంద‌ని చెప్పాలి.
 
ఆ త‌రువాత చాలా చిత్రాలే వ‌చ్చిన ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహ‌న్న‌ల‌గా విభిన్న పాత్ర‌ల్లో అత్య‌ద్భుతంగా న‌టించిన న‌ర్త‌నశాల‌ను ప్ర‌త్యేకించి చెప్పుకోవాలి. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు. పౌరాణిక బ్ర‌హ్మ‌గా చెప్ప‌ద‌గ్గ మ‌రో గొప్ప ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఈచిత్రంలో కీచ‌కుడి పాత్ర‌లో ఎస్వీఆర్ అసాధార‌ణ న‌ట‌న‌కు విదేశాల్లో సైతం గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌రువాత ఎన్టీఆర్ సుయోధ‌నుడిగా, కృష్ణుడిగా న‌టించి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన శ్రీకృష్ణ‌పాండ‌వీయం మ‌రో గొప్ప సినిమా. ఆ త‌రువాత కూడా ఎన్టీఆర్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దాన‌వీర‌శూర‌క‌ర్ణ వంటి చిత్రాలు తెలుగువారికి  పౌరాణిక చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో మ‌రెవ‌రూ సాటిరాలేర‌న్న కీర్తిని సంపాదించిపెట్టినవే. ఇక బాలీవుడ్‌లలో 1965లో బాబూభాయ్ మిస్త్రీ రూపొందించిన మ‌హాభార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో అభిభ‌ట్టాచార్య కృష్ణుడి పాత్ర‌లోనూ ప్ర‌దీప్‌కుమార్ అర్జునుడిగా, దారాసింగ్ భీముడిగా, ప‌ద్మిని ద్రౌప‌దిగా, తివారీ ధుర్యోధ‌నుడిగా న‌టించారు. ఆ త‌రువాత జైసంతోషీ మా చిత్రం కూడా మంచి విజ‌యాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: