మహేశ్ బాబు ఇటీవలే కరోనా బారినపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే కరోనా తగ్గేవరకు 'సర్కారు వారి పాట' సెట్స్‌లో అడుగుపెట్టకూడదనుకుంటున్నాడు మహేశ్. ఏప్రిల్ తర్వాత కరోనా ప్రభావం తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో మళ్లీ సమ్మర్ తర్వాతే షూటింగ్స్‌కి వెళ్లాలనుకుంటున్నాడు మహేశ్. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. మూవీ సెట్స్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో సెట్స్‌కి వెళ్లి టెన్షన్ వాతావరణం పని చెయ్యడం కంటే, కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు హీరోలు. దీంతో దర్శకనిర్మాతలు కూడా వాయిదాకే వెళ్తున్నారు.
అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమాని 2022 డిసెంబర్‌లోనే రిలీజ్ చేస్తానని చాన్నాళ్ల క్రితమే అనౌన్స్ చేశాడు. 'పుష్ప1' రిలీజ్ కాగానే సెకండ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనుకున్నాడు. కానీ 2022 ప్రారంభంలోనే థర్డ్ వేవ్ మొదలైంది. దీంతో 'పుష్ప-ది రూల్' షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఫ్రీకాగానే శంకర్ సినిమాలో జాయిన్ అయ్యాడు. పూణేలో షూటింగ్ కూడా జరిగింది. ఇక నెక్ట్స్ షెడ్యూల్‌కి రెడీ అవుతోన్న టైమ్‌లోనే కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఇంటికే పరిమితమయ్యాడు రామ్ చరణ్.
కొరటాల శివ 'ఆచార్య' నుంచి ఫ్రీకాగానే సినిమా మొదలుపెట్టాలనుకున్నాడు జూ.ఎన్టీఆర్. సంక్రాంతికి 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇక ఈ పాన్ ఇండియన్ మూవీపై ఫోకస్ చెయ్యాలనుకున్నాడు. అయితే థర్డ్ వేవ్‌తో ఈ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. ప్రభాస్ 'సలార్, ప్రాజెక్ట్-కె' సినిమా షూటింగ్స్‌కి కూడా బ్రేకులు పడ్డాయి. అలాగే బాలక్రిష్ణ, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ఇక 2020లో ఫస్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి షూటింగులకి బ్రేకులు పడుతున్నాయి. సెట్స్‌కి వెళ్లడం ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి కాగానే మళ్లీ వేవ్స్ రావడంతో వడ్డీలు పెరుగుతున్నాయి. నిర్మాతలపై భారం పెరుగుతోంది. ఒక్క స్టార్ హీరోల సినిమాలతోనే దాదాపుగా 1300 కోట్ల వరకు బిజినెస్ ఆగిపోయింది.