మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఫస్ట్‌ టైమ్‌ ఫుల్‌ లెంగ్త్ రోల్స్‌లో కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని ఈ మూవీని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్1కి పోస్ట్‌ పోన్‌ చేశారు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' ఎఫెక్ట్‌తో ఇప్పుడీ డేట్‌ కూడా మారుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా మార్చి 25న విడుదల అయితే, ఏప్రిల్‌1కి ఒక్క వారం మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఈ షార్ట్‌ గ్యాప్‌లో 'ఆచార్య' రిలీజ్ అయితే రెండు సినిమాల వసూళ్లు ఎఫెక్ట్ అవుతాయి. పైగా రెండు సినిమాల్లోనూ రామ్ చరణ్‌ ఉన్నాడు. ఇక 'ఆచార్య'కి చరణ్‌ నిర్మాణ భాగస్వామి. దీనికితోడు కొరటాల శివ 'ఆచార్య' తర్వాత జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ లెక్కలన్నిటితో 'ఆచార్య'ని ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది మెగా కాంపౌండ్.

దిల్‌ రాజు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ 'ఎఫ్-3'ని వాయిదా వేశాడు గానీ, అన్నయ్య చిరంజీవికి మాత్రం ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. 'ఆచార్య' ఏప్రిల్‌ 29న వస్తోంటే, 'ఎఫ్-3' ఒక రోజు ముందుగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'భీమ్లానాయక్‌'కి ఫిబ్రవరి 25ని ఇచ్చేసి ఏప్రిల్‌ 28కి వెళ్లింది 'ఎఫ్-3'. అయితే ఇప్పుడు 'ఆచార్య' ఏప్రిల్‌ 29న వస్తున్నా, పోటీకే సిద్ధమయ్యింది 'ఎఫ్-3'.

రెండేళ్ల నుంచి ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయింది. షూటింగులు ఆగిపోయి, రిలీజులు వాయిదా పడి నిర్మాతలపై వడ్డీల భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వన్‌ టు వన్ ఫైట్‌ చేసి, హీరోయిజం చూపించడం కంటే, సేఫ్‌గా సినిమాలు రిలీజ్ చేసి మంచి వసూళ్లు తెచ్చుకోవడం బెటర్‌ అనుకుంటున్నారు మేకర్స్. అందుకే సమ్మర్‌ సినిమాలన్నీ విడుదల తేదీలు మార్చుకుంటున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' రెండు ఆప్షన్స్‌ని విడిచిపెట్టి సింగిల్‌ డేట్‌కి ఫిక్స్ చేసుకుంటే, 'భీమ్లానాయక్' వన్ ప్లస్ వన్‌కి వెళ్లాడు. ఫిబ్రవరి 25తో పాటు, ఏప్రిల్‌1ని లాక్‌ చేసుకున్నాడు. సిట్యువేషన్స్‌ కంట్రోల్‌లో ఉంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్... లేదంటే ఏప్రిల్‌ 1 న సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు మేకర్స్. మహేశ్‌ బాబు 'సర్కారు వారి పాట'ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి ఏప్రిల్‌ 1న రిలీజ్ చేయాలనుకున్నాడు. అయితే కరోనా థర్డ్‌ వేవ్‌తో షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. మహేశ్‌ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో షెడ్యూల్స్‌ కూడా పోస్ట్‌పోన్ అయ్యాయి. ఈ వాయిదాలతో 'సర్కారు వారి పాట' రిలీజ్‌ డేట్‌ కూడా మారింది. ఏప్రిల్‌1 నుంచి మే 12కి వెళ్లింది.

'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25ని లాక్‌ చేసుకోవడంతో రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాని పోస్ట్‌ పోన్ చేస్తున్నారు మేకర్స్. పరిస్థితులని బట్టి మార్చి 25 లేకపోతే, ఏప్రిల్15న సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు. మార్చిలో కూడా ఒకవేళ 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్‌ కాకపోతే ఆ రోజున 'రామారావు'ని దింపుతారు. 'ఆర్ ఆర్ ఆర్' అనుకున్న సమయానికి వస్తే ఏప్రిల్‌ 15న రామారావు బరిలో దిగే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: