
టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతల సమస్యలను పరిష్కరించుకోవడానికి నెల రోజుల పాటు షూటింగ్ లు బంద్ చేసుకుని ప్రతిరోజు చర్చలు జరుపుకుంటూ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలు ఏమేరకు వాస్తవ రూపంలో అమలు జరుగుతాయి అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ లలో సినిమాలు విడుదల చేసుకోవాలి అంటే 8 వారాల గ్యాప్ ఉండాలి అంటూ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఓటీటీ సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయి అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి.
అంతేకాదు సినిమాల టైటిల్ కార్డ్స్ ముందు ఆసినిమా ఏ ఓటీటీలో అదేవిధంగా ఏ ఛానల్ లో ప్రసారం అవుతుంది అన్న కార్డును కూడ టైటిల్స్ ముందు వేయడానికి వీలు లేదు అని నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే తమ సంస్థ పేరును కూడ వేయడానికి ఇష్టపడని నిర్మాతలతో ఓటీటీ సంస్థలు వ్యవహారాలు నడిపి కోట్లు ఇస్తాయా అంటూ మరికొందరు అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈమధ్యనే రిలీజ్ అయి ఇప్పటికే ఫెయిల్ అయిన సినిమాల హీరోలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కేవలం సక్సస్ అయిన హీరోల సినిమాలు మాత్రమే తమ ఓటీటీ సంస్థలు కొంటాయి అంటూ ఒక నిబంధన పెట్టి నిర్మాతలతో బేరసారాలు ఆడుతున్నట్లు టాక్. దీనితో ఇప్పటివరకు సినిమా నిర్మాతలకు అదనపు ఆదాయంగా ఉన్న ఓటీటీ సంస్థల నుండి భారీ మొత్తాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
కేరెక్టర్ ఆర్టిస్టులు హాస్యనటుల కు ఇప్పటివరకు ఇస్తున్న రోజువారి పారితోషికాన్ని తీసివేసి పూర్వ పద్ధతిలో ఆపాత్రకు సంబంధించిన పారితోషికాన్ని ఇచ్చే విధానం ప్రవేశపెట్టాలని నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు కూడ ఎంతవరకు ఆచరణలోకి వస్తాయి అన్న సందేహాలు ఇండస్ట్రీలో కొందరికి కలుగుతున్నాయి. ఇక హీరోయిన్స్ వ్యక్తిగత సహాయకుల ఖర్చులు అన్నీ హీరోయిన్స్ మాత్రమే భరించాలి అని చెపుతున్న నిర్మాతలు టాప్ హీరోలకు ఈ రూల్స్ వర్తించవా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..