భారతీయ జనతాపార్టీ కీలక నేతలు ఏదోవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికలలో అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నిరకాల ప్రయత్నాలు ఉంటాయో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమధ్య అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన వద్దకు పిలిపించుకుని అతడి పై ప్రశంసలు కురిపించి ఏదోవిధంగా రాబోతున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ను పొందాలని గట్టి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.


అయితే ఈవిషయంలో తారక్ నుండి స్పష్టమైన వాగ్దానం భారతీయ జనతాపార్టీ పెద్దలకు లభించలేదు అన్న గుసగుసలు వినిపించాయి. దీనితో భారతీయ జనతాపార్టీ పెద్దలు తమ దృష్టిని తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి చెందిన నితిన్ పై పెట్టి అతడిని కూడా పిలిపించుకుని అతడి సపోర్ట్ అడిగినట్లు వార్తలు వచ్చాయి. దీనితో నితిన్ కూడ రాజకీయాలలోకి వస్తాడా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.


ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా భారతీయ జనతాపార్టీ పెద్దల దృష్టి నిఖిల్ పై పడింది అంటూ గాసిప్పుల హడావిడి మొదలైంది. ఈమధ్య నిఖిల్ ‘కార్తికేయ 2’ తో ఎవరు ఊహించని సంచలన విజయం సాధించడంతో అతడిపేరు మారుమ్రోగిపోతోంది. దీనికితోడు ‘కార్తికేయ 2’ కథ భగవాన్ శ్రీకృష్ణుడు చుట్టూ అల్లడంతో ఈమూవీ భారతీయ జనతాపార్టీ ప్రముఖుల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. దీనితో భారతీయ జనతాపార్టీ కీలక నేతలు త్వరలో నిఖిల్ ను కూడ తమ వద్దకు పిలిపించుకుని నిఖిల్ సహాయ సహకారాలు అడగబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఒక వార్తను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


గత ఎన్నికలలో స్వయంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రచారం చేసినప్పటికీ పవన్ తనకు తాను కూడ గెలవలేకపోయాడు. దీనితో సినిమా హీరోలను చూడటానికి జనం వస్తారు కానీ వారు ఓట్లు వేయరు అన్న విషయం స్పష్టంగా రాజకీయ నాయకులకు తెలిసి వచ్చేలా చేసింది. ఈ అనుభవాలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు ఎందుకు టాలీవుడ్ హీరోల పై విపరీతమైన నమ్మకంలో ఉన్నారు అన్నది సమాధానం లేని విషయంగా మారింది..




మరింత సమాచారం తెలుసుకోండి: