తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ యాంకర్ చేసిన నిర్వాకం తమిళ సోషల్ మీడియాలో తెలుగు వారందరినీ నవ్వుల పాలయ్యేలా చేసింది.
కొన్నాళ్ల క్రితం విజయ్ అభిమానులు, అలాగే తమిళ సినీ అభిమానులు అందరూ కూడా మహేష్ బాబు మీద దారుణంగా ట్రోల్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ విషయం జరిగినప్పటి నుంచి కూడా తమిళ అభిమానులు తెలుగు సినీ అభిమానులు ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడు ట్రోల్ చేయాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఒక సినిమా విషయంలో పొరపాటు పడి వారందరికీ అడ్డంగా బుక్కయ్యాడు.
అసలు విషయం ఏమిటంటే తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే ఒక సినిమా రూపొందించారు. శింబు హీరోగా రూపొందిన ఈ సినిమా తెలుగు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటుంది. ప్రకటించిన దాని కంటే తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలవడంతో సినిమా యూనిట్ తెలుగులో ప్రమోషన్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే ఒక యూట్యూబ్ ఛానల్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను యాంకర్ ఒక విచిత్రమైన ప్రశ్న సాధించాడు. మీ గత సినిమాలో శింబు, విజయ్ సేతుపతి వంటి వారందరినీ ఎలా ఒప్పించారు? ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేశారు? అలా ఎలా కుదిరింది అని ప్రశ్నించారు. నిజానికి సదరు యాంకర్ చెబుతున్న సినిమా చేసింది మణిరత్నం. దాన్ని తెలుగులో నవాబ్ పేరుతో విడుదల చేశారు. దానికి మిశ్రమ స్పందన లభించింది.
అయితే తాను ఆ సినిమా చేయలేదు అది చేసింది మణిరత్నం అని చెప్పాల్సిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాంకర్ ను ఆట పట్టించేందుకు తాను మణిరత్నం అన్నట్టుగా మాట్లాడారు. సాధారణంగా అలా వారందరినీ ఒకచోట చేర్చడం చాలా కష్టమైన విషయం అని కానీ తాను మణిరత్నం కావడంతో వాళ్లందరూ అడిగిన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాక గౌతమ్ మీనన్ సినిమా అంటే ఉదయం ఏడింటికి రావడానికి కూడా కష్టపడే శింబు మణిరత్నం సినిమా అంటే ఉదయం నాలుగున్నర ఐదు గంటలకే లేచి వస్తాడని సో వాళ్ళందరితో పని చేయడం తనకు చాలా ఆనందం కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఇంత జరిగినా తాను చేసిన పొరపాటు ఏమిటి అనే విషయం మాత్రం సదరు యాంకర్ కు అర్థం కాకపోవడం కొసమెరుపు. దీంతో తెలుగు యాంకర్లకు కనీసం సినిమాల మీద కూడా అవగాహన లేదు అంటూ తమిళ అభిమానులు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇకమీదట ఆయన ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే ముందు కాస్త శ్రద్ధ పెట్టి ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే విషయం మీద ముందే హోంవర్క్ చేయకపోతే ఇలా నవ్వుల పాలవ్వడం తప్పదని చెప్పాల్సిందే.