జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష కృష్ణన్ సహా పలువురు నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విక్రమ్, జయం రవి, ఐశ్వర్య, మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా ప్రతినిధులు చోళ హిస్టరీగా గురించి తక్కువ చేసి మాట్లాడినట్లు విక్రమ్ ఫీలయ్యారు. వెంటనే మైక్ తీసుకుని.. భారతదేశ చరిత్రను వివరించారు. మనం ఎంతో గొప్పగా మాట్లాడుకునే ఈజిప్ట్, యూరప్ హిస్టరీ కంటే భారతదేశ హిస్టరీ ఎంతో ఉన్నతమైనదని చెప్పారు. సదరు మనం గొప్పగా ఫీలయ్యే దేశాల్లో ఎలాంటి అభివృద్ధి లేనినాడే.. మన దేశం విదేశాలతో వర్తక వాణిజ్యం కొనసాగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు.
"చాలా మంది జనాలకు సైన్స్, ఆస్ట్రానమీ, జాగ్రఫీ, హిస్టరీ అనేక విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు గతంలో జరిగిన చరిత్రను కథలుగా వినేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. చందమామ లాంటి కథలను ఎంతో ఇష్టపడతారు. రాజులు, రాజ్యాల గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. ఈ సందర్భంగా మీకో విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను. మనం పిరమిడ్స్ గురించి మాట్లాడుకుంటాం. చాలా కాలం క్రితం వాటిని ఎలా నిర్మించారు? అంత గొప్పగా ఎలా కట్టారు? అని చర్చించుకుంటాం. కానీ, భారత్ లో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోం" అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గోపురం తంజావూరు ఆలయ గోపురం
"ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురం తంజావూరులో ఉన్నది. చోళుల పరిపాలనలో ఈ ఆలయం నిర్మించారు. రాజరాజ చోళ ఈ ఆలయాన్ని కట్టించారు. గోపురం పై భాగంలో ఉన్న శిల ఏకశిల. దాని బరువు 80 టన్నులు. ఒకటన్ను, రెండు టన్నులు కాదు. మనం పిరమిడ్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ, ఈ ఆలయం గురించి పెద్దగా మాట్లాడుకోం. మామూలుగా చూస్తాం. వావ్ అంటూ సెల్ఫీలు తీసుకుంటాం. కానీ, ఆలయ చరిత్ర గురించి తెలుసుకోం. తంజావూరు ఆలయగోపుర నిర్మాణం సమయంలో 80 టన్నుల బరువున్న శిలను పైకి తీసుకెళ్లేందుకు సుమారు 6 కిలో మీటర్ల దూరం నుంచి ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ రాయిని బుల్స్, ఎలిఫెంట్స్, జనాలు కలిపి పైకి తీసుకెళ్లారు. ఎలాంటి యంత్రాలు లేవు. క్రేన్లు లేవు. ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఆరుసార్లు భూకంపాలు వచ్చాయి. కానీ, ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీనికి కారణం ఆల్ట్రా వాల్స్ నిర్మాణం. ఆరు ఫీట్ల కారిడార్ తో పాటు లోపల మరో నిర్మాణం చేపట్టి గోపరాన్ని రూపొందించారు. ఇంత గొప్పగా కట్టారు కాబట్టే భూకంపాలు కూడా తంజావూరు ఆలయాన్ని ఏం చేయలేకపోయాయి." అన్నారు.
చోళ రాజ్య పరిపాలన ఎంతో గొప్పది
చోళ రాజుల పరిపాలనపైనా విక్రమ్ ప్రశంసలు కురిపించారు. "రాజరాజ చోళ రూలింగ్ లో 5 వేల నీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఆ రోజుల్లోనే వాటర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే గ్రామ నాయకులను ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహించారు. ఉచిత వైద్యం కోసం హాస్పిటల్స్ నిర్మించారు. ప్రజల ఆర్థిక పురోగతి కోసం లోన్లు కూడా ఇచ్చారు. తొమ్మిదవ శతాబ్దంలోనే ఇంతగొప్ప పాలన ఉండేది. ప్రపంచంలోనే గొప్ప పాలనతో వర్ధిల్లాం. అమెరికాను కొలంబస్ కనిపెట్టకముందే మనం ఎంతో అభివృద్ధి చెందాం.. తొమ్మిదో శతాబ్దంలో యూరప్ కంట్రీస్ అనేవి డార్క్ లోనే ఉండిపోయాయి. అక్కడ ఏమీ లేదప్పుడు. ఆ సమయంలోనే మనం ఇతర దేశాలతో వర్తకవాణిజ్యం కొనసాగించాం. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అని కాదు. మనం అంతా భారతీయులం అని గర్వంగా చెప్పుకుందాం" అని విక్రమ్ చెప్పారు.