నటీ, నటులపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ ప్రస్తుతం సర్వసాధారణమై పోయింది. ఏ చిన్నమాట మాట్లాడినా ట్రోలర్స్‌ నటులపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ ట్రోల్‌ చేసేస్తున్నారు.ప్రస్తుతం అలా ట్రోలింగ్‌కి గురవుతున్న వారిలో తమిళనటి అపర్ణ బాలమురళి ఒకరు. ఈ పేరు తెలుగువారికి కొత్త కావచ్చు. కానీ తమిళ, మలయాళ సినీ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితమే. అయితే అపర్ణ 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న ఈమె ప్రస్తుతం 'కప్పా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు..!
నటిగా తనను తాను నిరూపించుకోవాలని ఆశ పడిందామె. అందుకు తగినట్లుగానే.. 18 ఏళ్ల వయసులో ఆ అవకాశం ఆమెను వరించింది. 2013లో 'యాత్ర తుదరున్ను' అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మరోవైపు '8 బుల్లెట్స్‌' అనే చిత్రంతో తమిళంలోనూ అరంగేట్రం చేశారు అపర్ణ. అయితే అపర్ణది సినీ నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి కెపి బాలమురళి సినీ సంగీత దర్శకుడు. తల్లి శోభ లాయర్‌. కేరళలోని త్రిస్సూరులో జన్మించిన అపర్ణ బాలమురళి స్థానికంగా స్కూలింగ్‌ పూర్తి చేశారు. అనంతరం పాలక్కడ్‌లోని 'గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌'లో ఉన్నత విద్యను అభ్యసించారు. తండ్రిని చూసి తానూ సంగీతంపై ప్రేమ పెంచుకున్నారు. ఈ మక్కువతోనే చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు.. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో కొన్ని పాటలు పాడి, గాయనిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.

బరువైన పాత్రలకే ప్రాధాన్యం..
తమిళ, మలయాళ చిత్రసీమలో ఏడేళ్ల ప్రయాణంలో బరువైన పాత్రలతో పాటు.. కథకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించడానికే ఎక్కువ ఇష్టపడ్డానని చెబుతున్నారు అపర్ణ. ఈ ఏడేళ్ల కాలంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా.. 'మహేషింటే ప్రతీకారం', 'సండే హాలీడే', 'సూరారై పోట్రు'.. వంటి సినిమాల్లోని పాత్రలు తనకు మంచిపేరు తెచ్చి పెట్టాయని చెబుతున్నారు.
సూర్య సరసన 'సూరారై పోట్రు' చిత్రంలో 'బొమ్మి' అనే పాత్రతో మెప్పించిన ఆమె.. ఓ అర్ధాంగిగా, వ్యాపారవేత్తగా తన భర్తకు కష్టసుఖాల్లో తోడుంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఇందులో ఆమె నట ప్రతిభకు తాజాగా 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డు వచ్చిందంటేనే ఆ పాత్రలో ఆమె ఎంతగా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రం గతేడాది ఆస్కార్‌ బరిలోనూ నిలవడం విశేషం.
శాస్త్రీయ నృత్యాల్లోనూ శిక్షణ..
నటిగానే కాదు.. అపర్ణ మంచి డ్యాన్సర్‌ కూడా! చిన్న వయసులోనే భరతనాట్యం, కూచిపూడి.. వంటి శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ తీసుకొని ఆరితేరింది. ఇక తన డ్యాన్స్‌ వీడియోలు, సినిమా విశేషాలను తన యూట్యూబ్‌ ఛానల్‌లోనూ పంచుకుంటుంటారు. నటిగా, గాయనిగా తనను తాను నిరూపించుకుంటోన్న ఈ కేరళ కుట్టికి మంచి ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా ఉంది. ఇందుకు ఆమె ఇన్‌స్టాలో తరచూ పోస్ట్‌ చేసే ఫ్యాషనబుల్‌ ఫొటోలే ప్రత్యక్ష సాక్ష్యం!
ఫిట్‌నెస్‌ పైనా ఎక్కువ మక్కువ చూపుతానని చెబుతున్నారు అపర్ణ. ఈ క్రమంలోనే తాను బాక్సింగ్‌, ఇతర వ్యాయామాలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోల్నీ సోషల్‌ మీడియాలోపంచుకుంటున్నారు. అపర్ణకు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే! ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాలో 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
మొదట్లో కాస్త బాధపడ్డా..
'పాత్రతో పాటు కథకు ప్రాధాన్యమున్న చిత్రాల్నే ఎంచుకుంటూ వస్తున్నా.. చాలామంది నటీమణుల్లాగే గతంలో నా శరీరాకృతి విషయంలో నాకూ పలు విమర్శలు ఎదురయ్యాయి. అయితే మొదట్లో వీటిని తలచుకొని కాస్త బాధపడ్డా.. ఇప్పుడు ఇలాంటివేవీ పట్టించుకోవట్లేదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇలాంటి అనవసర విషయాల పైకి మనసు మళ్లదు.' అంటూ తన మాటలతోనూ యువతలో స్ఫూర్తి నింపుతున్నారు.
కాగా ప్రస్తుతం తమిళంలో 'నిత్యం ఆరుదానం' అనే చిత్రంలో అశోక్‌ సెల్వన్‌కు జంటగా నటిస్తోన్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌ పోస్టర్‌ను ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో అపర్ణ బాలమురళి బొద్దుగా ఉన్నట్లు కనిపించడంతో ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. దీనిపై స్పందిస్తూ 'శరీర బరువుకు, ప్రతిభకు సంబంధమే లేదు. స్లిమ్‌గా ఉంటేనే అవకాశాలు వస్తాయనడంలో అర్థం లేదు. ఆరోగ్య సమస్య లేదా మరే ఇతర కారణాల వల్లో శరీర బరువులో మార్పులు జరగవచ్చు. అయితే నేను ఎలా ఉన్నా చాలామంది అంగీకరిస్తున్నారు' అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'కప్పా' చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా అపర్ణ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: