మల్లెమాల సంస్థ సుధీర్ కి ప్రాధాన్యత ఇచ్చింది. అతన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం జరిగింది. రష్మితో లవ్ టాక్, ఢీ షోలో అతని యాంకరింగ్ కెరీర్ కి ప్లస్ అయ్యింది. ఏకంగా సినిమాల్లో హీరోగా చేసే రేంజ్ కి ఎదిగాడు. సుడిగాలి సుధీర్ హీరోగా రెండు మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. గాలోడు, కాలింగ్ సహస్ర చిత్రాల్లో ఆయన హీరోగా చేస్తున్నారు.
అయితే సుధీర్ మల్లెమాల షోస్ కి దూరం కావడం ఒకింత నిరాశపరిచే అంశం. ఈటీవీకి పూర్తిగా దూరమైన సుధీర్ ఇతర ఛానల్స్ లో మాత్రం షో చేస్తున్నాడు. మొదట ఢీ షో నుండి తప్పుకున్న సుధీర్ అనంతరం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో సుధీర్ మల్లెమాల సంస్థకు దూరం కావడానికి కారణం ఏమిటనే సందేహాలు అందరిలో ఉన్నాయి. రెమ్యునరేషన్ ప్రధాన కారణం అంటూ పలు కథనాలు వినిపించినా పూర్తి స్పష్టత లేదు.
దీనిపై తాజాగా చలాకీ చంటి స్పందించారు. అస్పష్టంగా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. సుడిగాలి సుధీర్ చేసిన రెండు తప్పులు మల్లెమాల సంస్థకు దూరం అయ్యేలా చేశాయని నేను విన్నాను అన్నారు. సుడిగాలి చేసిన కొన్ని పనులు నచ్చని మల్లెమాల దూరం పెట్టిందన్నారు. సుడిగాలి సుధీర్ మరలా జబర్దస్త్ కి రావాలని ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తుండగా.. చలాకీ చంటి ఈ విధంగా స్పందించారు. మనకు గుర్తింపు ఇచ్చిన సంస్థ పట్ల గౌరవంతో ఉండాలి.
నేను మూడు సార్లు జబర్దస్త్ నుండి బయటకు పోయి తిరిగి వచ్చాను. ఎప్పుడు బయటకు వెళ్లినా సహేతుకమైన కారణంతో వెళ్ళాను. సంస్థకు మనం ఎంత లాయల్ గా ఉన్నాము, ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నామన్నది ముఖ్యం. నేను జబర్దస్త్ వదిలేసినా వేరే ఛానల్ కి వెళ్ళలేదు. ఇతర షోస్ లో పాల్గొనలేదు. అందుకే తిరిగి వచ్చినా అవకాశం ఇచ్చారని చంటి అన్నారు. ఈటీవి షోస్ వదిలేసి ఇతర ఛానల్స్ లో షోస్ చేయడం కూడా సుడిగాలి సుధీర్ ని మల్లెమాల దూరం పెట్టడానికి ఒక కారణం అని చంటి పరోక్షంగా చెప్పారు.
కాగా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో పాల్గొన్న చంటి ఐదవ వారం ఎలిమినేట్ అయ్యాడు. హౌస్లో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన చంటి మంచి గేమర్ కాలేకపోయాడు. కాంట్రవర్సీలకు, గేమ్స్, టాస్క్స్ విషయంలో ఆసక్తి చూపని చంటి ఎలిమినేట్ కావడం జరిగింది. అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టిన చంటి అనూహ్యంగా గేమ్ ముగించాడు.