ఈవారం అల్లరి నరేష్ మూవీతో పాటు చాల డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ ఈవారం కూడ ధియేటర్లలో సందడి కనిపించే ఆస్కారం లేదు అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో ఇండస్ట్రీ ఆశలు అన్నీ డిసెంబర్ పైనే ఉన్నాయి. డిసెంబర్ మొదటివారంలో విడుదల అవుతున్న అడవి శేషు ‘హిట్ 2’ మూవీతో తిరిగి ధియేటర్లు కళకళలాడుతాయని అంచనాలు వేస్తున్నారు.
ఈ అంచనాలకు తగ్గట్టుగానే అడవి శేషు ‘హిట్ 2’ మూవీని చాల విస్తృతంగా ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ మూవీ పై అంచనాలు పెంచుతున్నారు. ఇది ఇలా ఉంటే ‘హిట్ 2’ మూవీ కథ ఈమధ్యనే ఢిల్లీ లో జరిగిన ఒక వాస్తవ సంఘటనకు దగ్గరగా అనిపిస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు అందరికీ తెలిసిందే ఈ సంఘటన దేశాన్ని కుదిపేసింది. శ్రద్దా అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేయడం ఆ ముక్కలను ఫ్రిజ్ లో దాచి ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేయడం సంచలనంగా మారింది.
ఇప్పుడు ‘హిట్ 2’ సినిమాను చూసిన వారికి ఆ సంఘటన ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది అంటున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో అమ్మాయిల శరీర భాగాలను వేరు చేసి అతి కిరాతకంగా హత్య చేస్తున్న నర హంతకుడిని పట్టుకునే పాత్రలో అడవి శేషు కనిపించాడు. ఈవిషయాన్ని మీడియా వర్గాలు అడవి శేషు వద్ద ప్రస్తావిస్తే అది అనుకోకుండా జరిగిన విషయం అంటూ ఈమూవీ కథను దాదాపు రెండు సంవత్సరాల క్రితం వ్రాసారని అందువల్ల ఢిల్లీ సంఘటనకు ఈమూవీకి ఎలా పోలిక ఉంటుంది అంటూ ఒకోసారి అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి అంటూ కామెంట్స్ చేసాడు..