ప్రేమలోకతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి రణధీరతో బ్లాక్ బస్టర్ సాధించిన రవిచంద్రన్ చేతిలో బోలెడు డబ్బుంది. తండ్రి వీరాస్వామి పేరుమోసిన డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత. ఇంకేముంది ఆలస్యం చేయకుండా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు. శివ ఇచ్చిన కిక్ కి డిఫరెంట్ సబ్జెక్టుల కోసమే ఎదురు చూస్తున్న నాగార్జునకు శాంతి క్రాంతి విపరీతంగా నచ్చేసింది. పైగా పోలీస్ ఆఫీసర్ పాత్ర. బెంగళూరులో చాలా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. కన్నడలో రవిచంద్రన్ తెలుగులో నాగ్ హిందీ తమిళంలో రజనీకాంత్ ని సెట్ చేశారు. అంటే ఒక్కో సీన్ నాలుగు సార్లు తీసేవారు. డబ్బింగ్ చేసే అవకాశం ఉన్నా సహజత్వం కోసం రవిచంద్రన్ రాజీ పడలేదు.
కట్ చేస్తే ఏళ్ళు గడుస్తున్నా శాంతి క్రాంతి బడ్జెట్ కంట్రోల్ తప్పింది కానీ సినిమా టైంకి పూర్తి కాలేకపోయింది. ఒకదశలో చేతిలో డబ్బులు లేక షూటింగ్ ఆగిపోయింది. రజిని నాగ్ లు పూర్తి సహకారంతో డేట్లు ఇస్తున్నారు. చాలా బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న అనంత్ నాగ్ మొదటిసారి పూర్తి విలన్ గా నటించడం పట్ల ఇండస్ట్రీలో ఒకటే చర్చ. ఇక వదిలేద్దాం అనుకుంటున్న టైంలో ఆసుపత్రి బెడ్ మీదున్న వీరాస్వామి కొడుకుని పిలిచి నిన్ను నమ్మి ఇద్దరు స్టార్ హీరోలు కాల్ షీట్లు ఇచ్చారు, లాభమో నష్టమో పూర్తి చెయ్, ఆడుతుందని పోతుందని ఎవరూ ముందే జ్యోతిష్యం చెప్పలేరు కాబట్టి అనవసరమైన అనుమానానాలు పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు
డబ్బు సర్దుబాటు కోసం ప్రయత్నిస్తూ ఉండగా తమిళంలో చిన్నతంబి పెద్ద హిట్ కావడంతో తనతో శాంతి క్రాంతిలో నటిస్తున్న ఖుష్బూ రికమండేషన్ మీద రవిచంద్రన్ దాని హక్కులు కొనేసి రామాచారి పేరుతో వేగంగా రీమేక్ చేశారు. కాసుల వర్షం కురిసింది. దీన్నే వెంకటేష్ చంటిగా తెలుగులో తీశారు. రవిచంద్రన్ అప్పులన్నీ తీరిపోయి శాంతి క్రాంతి బ్యాలన్స్ షూటింగ్ కి కావాల్సిన సొమ్ములు సమకూరాయి. ఎలాగోలా పూర్తి చేశారు. 1991 సెప్టెంబర్ లో రిలీజైన శాంతి క్రాంతి అన్ని భాషల్లో యునానిమస్ గా డిజాస్టర్ అయ్యింది. బయ్యర్లను నిండా ముంచేసింది. అవసరానికి మించిన పాటలతో, ఓవర్ డ్రామాతో తెరకెక్కించిన తీరు జనాన్ని విసిగించేసింది. ఎనిమిది కోట్ల దాకా బడ్జెట్ పెడితే అందులో పావు వంతు కూడా రాలేదు. తిరిగి రవిచంద్రన్ కోలుకోవడానికి ఐదారేళ్ళు పట్టిందని ఆయనే చెప్పుకున్నారు.