టాలీవుడ్ లో ఎందరో నటీనటులు గొప్ప స్థాయికి వెళ్లాలని తమ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏ కొందరు మాత్రమే సినిమా నేపధ్యం సహాయంతో సక్సెస్ అవుతుంటారు. కానీ ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయినవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో ఒకరే మాస్ మహారాజా రవితేజ. ఈయన కూడా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తానే సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగాడు. రవితేజ లాస్ట్ హిట్ కొట్టిన సినిమా అంటే క్రాక్ అని చెప్పాలి.

మలినేని గోపిచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు "ఖిలాడీ" మరియు "రామారావు ఆన్ డ్యూటీ" లు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవిచూశాయి. అందుకే ఈసారి తన నుండి వస్తున్న చిత్రంపై మాస్ మహారాజ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ మరియు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం "ధమాకా", ఇందులో రవితేజ సరసన యంగ్ లేడీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారని ట్రైలర్ మరియు టీజర్ లను చూస్తే అర్ధమవుతోంది.

ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి. భీమ్స్ సిసిరిలో స్వరపరిచిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా ఈ సినిమాకు అన్నీ పాజిటివ్స్ ఉన్నాయని చెప్పాలి. ఇక ప్రేక్షకుల నుండి హామీ రావడం ఒక్కటే మిగిలింది. అది తెలియాలంటే ఎల్లుండి విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా హిట్ కావడం రవితేజకు ఎంత అవసరం అన్నది తెలిసిందే. మరి చూద్దాం ధమాకా రవితేజకు కెరీర్ లో మరో హిట్ ను అందించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పంట పండిస్తుందా లేదా అన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: