పంజాబ్ ఫ్యామిలీ: ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది గ్లామరస్ భామ పూనమ్ బజ్వా. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. 2005 సంవత్సరంలో మిస్ పూణెగా టైటిల్ కొట్టిన ఈ సుందరి హైదరాబాద్ లో ఒక షోలో ర్యాంప్ వాక్ తో ఆకట్టుకుంది.
ఫ్యాషన్ షోలో: హైదరాబాద్ ఫ్యాషన్ షోలో పూనమ్ బజ్వా అందాలకు ఫిదా అయిన 'మొదటి సినిమా' డైరెక్టర్ కూచిపూడి వెంకట్ తన సినిమాలో నటించమని ఆమెను కోరాడు. అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పూనమ్ కు మొదట బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాంటి తప్పు: నవదీప్ నటించిన 'మొదటి సినిమా'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూనమ్ బజ్వా. ఈ సినిమాతో మంచి హీరోయిన్ గా సత్తా చాటుతుంది అని అంతా భావించారు. కానీ ఊహించిన దానికి భిన్నంగా ఆమె కెరీర్ సాగాల్సి వచ్చింది. ఎందుకంటే మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో కొన్ని పెద్ద సినిమాలు ఒప్పుకుని తప్పులు చేసింది ఈ వయ్యారి.
తగ్గిపోయిన క్రేజ్: హాట్ బ్యూటి పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాలలో ఒకటి బాస్. కింగ్ నాగార్జునతో జత కట్టిన బాస్ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో పూనమ్ అంచనాలు తలకిందులు అయ్యాయి. వీటితో పాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించిన పూనమ్ కి అందులో ఏ ఒక్క సినిమా కూడా అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. దీంతో వరుస అపజయాలతో ఆమె క్రేజ్ తగ్గిపోయింది.
చేసేది లేక: ఇక చేసేది లేక పూనమ్ బాజ్వా పలు పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమాలో పూనమ్ హీరోయిన్ షీలాకు అక్కగా నటించి ఆకట్టుకుంది. దీని తర్వాత ముద్దుగుమ్మ పూనమ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో లోకేశ్వరి పాత్రలో కనిపించి రీ ఎంట్రీ ఇచ్చింది.
తమిళంలో మాత్రం: ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన సినిమాతో కూడా పూనమ్ కు ఎలాంటి క్రేజ్ రాలేదు. దీంతో ఆమె తెలుగులో నటించడం ప్రస్తుతం మానేసింది. కానీ తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం సూపర్ హాట్ హీరోయిన్ గా విపరీతంగా పాపులర్ అయింది. రోమియో జూలియట్, మస్త్ మొహబత్, మంత్రికన్, అరన్మణి 2, రోసాపుక్కాలమ్, శికారి, చైనా టౌన్ వంటి తదితర సినిమాలు చేసింది.