థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చిత్రాలు కొన్ని.. ఇటీవల ఓటీటీలోకి వచ్చాక దుమ్మురేపుతున్నాయి. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కొన్ని చిన్న సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి.స్ట్రీమింగ్‍లో అదరగొడుతున్నాయి. ఆర్ఎక్స్100 ఫేమ్ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్రలో నటించిన మాయాపేటిక కూడా ఇదే జాబితాలోకి వచ్చింది. ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయింది. జూన్ 30 తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాక అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఓ సెల్‍ఫోన్ చుట్టూ ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. రమేశ్ రాపర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. థియేటర్లలో మాయాపేటిక సినిమాకు అంతగా ఆదరణ లభించకపోయినా.. ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది.

ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి సెప్టెంబర్ 15వ తేదీన మాయాపేటిక చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. అప్పటి నుంచి ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా, మాయపేటిక సినిమా ఆహా ఓటీటీలో 25 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటింది. నాలుగు రోజుల్లోనే 25 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును దాటింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.మాయాపేటిక చిత్రంలో పాయల్ రాజ్‍‍పుత్‍తో పాటు విరాజ్ అశ్విన్, సునీల్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, హిమజ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మొత్తం ఆరు చిన్నచిన్న కథలు ఉంటాయి. వేర్వేరు కథలే అయినా.. ఒకే ఫోన్ ఆ కథల్లో తిరుగుతుంటుంది. చివర్లో అన్ని కథల్లోని పాత్రలను కలిపేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రమేశ్.

కథపరంగా ఆసక్తికరంగానే ఉన్నా.. మాయాపేటికను తెరకెక్కించిన విధానం నిరాశపరిచిందని మిశ్రమ స్పందనలు వచ్చాయి. కామెడీ కూడా చోట్ల పండలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆహా ఓటీటీలో మాత్రం ఈ చిత్రం ఆదరణ దక్కించుకుంటోంది.మాయాపేటిక సినిమాను శరత్ చంద్రారెడ్డి, తారక్‍నాథ్ సంయుక్తంగా నిర్మించారు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు. వెంకట ప్రభు ఎడిటింగ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: