నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డెవిల్'. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా డెవిల్ మూవీ దర్శకుడి విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మొదట్లో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుని ప్రకటించారు. కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం 'డైరెక్టెడ్ బై అభిషేక్ నామా పిక్చర్స్ టీమ్' అని వేశారు.

 ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ టైం కి నిర్మాత అభిషేక్ నామ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పటివరకు రైటింగ్, డైరెక్షన్ లో ఇతనికి ఎలాంటి అనుభవం లేదు. కేవలం నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలను నిర్మించాడు. అలాంటి అభిషేక్ నామ ఉన్నట్టుండి ఎలా డైరెక్టర్ అయిపోయాడో సినీ జనాలకు ఏమాత్రం అంతు పట్టడం లేదు. మామూలుగా డైరెక్టర్ తో నిర్మాతకి విభేదాలు వస్తే అతన్ని తప్పించి మరొకరిని పెట్టి సినిమా పూర్తి చేస్తారు. కానీ ఇలా నిర్మాతే దర్శకుడిగా మారడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

 టీజర్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ గా నవీన్ పేరు తీసేసినప్పటికీ టెక్నికల్ టీం లో తన పేరు ఉంది. కానీ తర్వాత తన పేరుని ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. మొన్నటిదాకా ఈ సినిమాలో ఏమాత్రం భాగస్వామ్యం లేని రైటర్ శ్రీకాంత్ విస్సా ఇప్పుడు డెవిల్ మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్ క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ అతనికే ఇచ్చారు. అంటే అభిషేక్ పిక్చర్స్ టీం తో కలిసి నవీన్ మేడారం రెడీ చేసిన స్క్రిప్ట్ ని పూర్తిగా పక్కన పెట్టారా? లేకపోతే అదే స్క్రిప్ట్ కి శ్రీకాంత్ విస్సా మెరుగులు దిద్దాడా? అనే విషయం ఇంకా తెలియ రాలేదు.డిసెంబర్ 29న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: