కథ:
తన్వి(భానుశ్రీ) ఒక హారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటుంది. అయితే దానికోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకొని ఒక నిర్మాతను కలిసి ఆయనకు కథ వినిపించగా ఆయన గత మొత్తం విని క్లైమాక్స్ మార్చమని చెబుతాడు. దాంతో తన్వి హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితురాలు కలశ(సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి కలశ అక్కడ ఉండదు. తన్వి కాల్ చేస్తే పని మీద బయటకు వెళ్లాలని కాస్త లేట్‌గా వస్తాను అని చెప్తుంది. తన్వి ఒక్కతే ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు తన్వి రాసుకున్న కథలోని ఇల్లు మాదిరిగానే ఉంటుంది. తన కథలో ఉన్న కొన్ని సీన్లే తన కళ్లముందు రిపీట్ అవుతాయి. అయితే తన్వి ప్రతి ఒక్క కదలికను అక్కడే ఉన్న ఒక వ్యక్తి దొంగచాటుగా గమనిస్తూ ఉంటాడు. కలశ చెల్లి అన్షు(రోషిణి కామిశెట్టి) తనను ఆట పట్టిస్తుందని తన్వి భావిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు తన్వికి ఒక నిజం తెలుస్తుంది. కలశ, అంజు ఇద్దరూ రెండు నెలల క్రితమే చనిపోయారని, ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. మరి తన్వికి ఫోన్ కాల్ చేసిందెవరు? అంజు, కలశ ఎలా చనిపోయారు? కలశ నేపథ్యం ఏంటి? రచయిత రాహుల్(అనురాగ్)తో ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సాఫ్ట్‌వేర్ ఉద్యోణి మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందింది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ తెరపై దాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యారు. ఫస్టాఫ్ మొత్తం అంతా కూడా కాస్త బోరింగ్ గానే అనిపిస్తుంది. ప్రథమార్థంలో ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యత ఇచ్చారు. రచ్చ రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్ నవ్వులు పూయిస్తుంది. కానిస్టేబుల్ నారాయణ, అతని కూతురు మానసల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇంట్లో దెయ్యం చేసే పనులు కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తే మరికొన్ని చోట్ల భయానికి గురి చేస్తాయి. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ పరుగులు తీసుస్తుంది. కలశ నేపథ్యం, అక్కాచెల్లెళ్ల చావులకు గల కారణాలు ఊహించని విధంగా ఉంటాయి. కార్తికేయ ఇన్వెస్టిగేషన్ లో తెలిసే ట్విస్టులు థ్రిల్లింగ్ ఉంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది.
నటీనటుల పనితీరు :
నటి భానుశ్రీ కి ఈ సినిమాతో మంచి అవకాశం లభించింది. భాను శ్రీ తన్వి పాత్రలో చక్కగా నటించింది. ఒకవైపు అందాలను ఆరబోస్తూనే మరోవైపు తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. టైటిల్ రోల్ ప్లే చేసిన సోనాక్షి వర్మ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సెకండాఫ్‌తో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. అన్షుగా రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐగా సమీర్, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు.
సాంకేతికత :
సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా పర్వాలేదు. విజయ్ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల భయపెట్టిస్తుంది. వెంకట్ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది.
రేటింగ్ :
3
టైటిల్: కలశ
నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు
నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి
దర్శకత్వం: కొండా రాంబాబు
సంగీతం: విజయ్ కురాకుల
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగధారి
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
విడుదల తేది: డిసెంబర్ 15, 2023