'కల్కి 2898 AD' సినిమాకోసం యావత్ భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తోంది. కాగా ఈ గురువారం కల్కి థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమాపైన ఈపాటికే రిలీజైన ప్ర‌మోష‌నల్ మెటీరియ‌ల్, టీజ‌ర్, ట్రైల‌ర్ పాట‌లు ఇలా అన్నీ కూడా భారీ అంచనాలు పెంచేసాయి. దాంతో ఈ సినిమా ఆన్లైన్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో బుక్ మై షో అయితే స్తంభించిపోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. టికెట్ బుకింగ్ సైట్లు క్రాస్ అయ్యేంత‌గా క‌ల్కి థియేట‌ర్ల‌పై ఒత్తిడి ఉంద‌ని ట్రేడ్ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఈ చిత్రం నుండి 'థీమ్ ఆఫ్ కల్కి'ని విడుద‌ల చేయడం జరిగింది.

దాంతో ఈ పాట రిలీజైన క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ పాట విన్న జనాలు నీరాజనాలు పడుతున్నారు. ఇది లార్డ్ శ్రీకృష్ణునిపై పాట. మనోహరమైన దైవికమైన ఈ పాటను కాల భైరవ పడగా ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించడం జరిగింది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సంగీతానికి అనుగుణంగా బోస్ సాహిత్యం అద్భుతంగా ఉండడంతో జనాలు వారెవ్వా బోస్ సాహిత్యం అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ లిరిక్ లో లార్డ్ కృష్ణ‌ను స్థుతిస్తూ.. చంద్ర‌బోస్ రాసిన ప‌దాలకు అనుగుణంగా వార్ నేప‌థ్యంలో భైర‌వ‌.. అశ్వ‌త్థామ పాత్ర‌ల విజువ‌ల్స్... దీపిక దూత పాత్ర ఇవ‌న్నీ ఎంతో ఉత్కంఠ‌ను పెంచుతుండ‌గా.. ఎంతో సున్నితంగా హృద‌యాల‌ను తాకుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దాంతో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో 'నాటునాటు..'కు ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ మరోసారి ఆస్కార్ అందుకోబోతాడా అని కొంతమంది జోశ్యం చెబుతున్నారు. సినిమా ఇతివృత్తాన్ని సంపూర్ణంగా ఒడిసి పట్టుకుని లిరిక్ ని అందించ‌డం చంద్రబోస్ గొప్పతనం. ఒకసారి లిరిక్స్ ని గమనిస్తే... అధ‌ర్మాన్ని అణిచేయ‌గా, యుగ‌యుగాల జ‌గ‌ములోన పరిప‌రివిధాల్లోన విభ‌వించే విక్ర‌మ విరాట్ రూప‌మిత‌డే.. స్వ‌ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించ‌గ‌.. స‌మ‌స్తాన్ని ప్ర‌క్షాళించ‌గా.. స‌ముద్భ‌వించే అవ‌తార‌మిదే.. మీన‌మై.. కూర్మ‌మై .. వ‌రాహ‌మై.. మ‌న‌కు సాయ‌మై..... ఇలా ప్ర‌తి ప‌దంలో చంద్ర‌బోస్ తన సాహిత్యాన్ని రంగరించాడు అనడంలో సందేహమే లేదు. ఇకపోతే శ్రీకృష్ణుని జన్మస్థలంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న పవిత్ర భూమి మధురలో ఈ పాట ప్రారంభించడం మరో ఎత్తు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 AD'లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు నటించడం ఓ చరిత్ర అని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: