కల్కి సినిమా హడావుడి దాదాపు దేశంలో ప్రతిచోటా నెలకొంది. ఇక హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా 70 ఎంఎం థియేటర్ వద్దకు అయితే ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీతో వస్తూ సందడి చేసారు. ఈ క్రమంలో ప్రభాస్ కటౌట్ ముందు అభిమానులు డ్యాన్సులు చేసి, పాలాభిషేకాలు నిర్వహించారు. ప్రముఖ సినిమా థియేటర్లలో తెల్లవారుజామున ఉదయం 4.30 కు కల్కి సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయగా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్న పరిస్థితి.

ఇక ఈపాటికే మొదటి 3 రోజుల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. అయినా సరే బ్లాక్లో భారీ ధరకు టికెట్లు కొని మరీ ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్ల దగ్గర క్యూలు కట్టారు. ఇక హైదరాబాద్, సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా అయితే న భూతో న భవిష్యతి. ఏ హీరో సినిమా అయినా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో అభిమానుల సందడి చేయడం అనేది ఉంటుంది. కానీ పాన్ ఇండియా స్టార్, మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే మామూలుగా ఉంటుందా? సినిమా విడుదలకు రెండు మూడు గంటల నుంచే, కొందరైతే ఏకంగా రాత్రి నుంచే థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ అభిమానులతో కిక్కిరిసిపోయిందని సమాచారం.

ఈ నేపథ్యంలో థియేటర్ మొత్తం రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్లతో నింపేశారు నిర్వాహకులు. ప్రభాస్ చిత్రానికి భారీ గజమాలలను వేస్తూ పాలాభిషేకంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. అయితే పలు థియేటర్ల వద్ద టికెట్ కొందామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. బుకింగ్స్ ప్రారంభించిన క్షణాల్లో టికెట్లు మొత్తం అమ్ముడుపోవడంతో ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని థియేటర్లు మాత్రం టికెట్స్ ని బ్లాక్ చేస్తూ ఆన్లైన్లో పెట్టకుండా ఏకంగా బ్లాక్ లో అమ్మినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల బెనిఫిట్ షో టికెట్స్ వేలల్లో అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక థియేటర్ల వద్ద జనసందోహాన్ని కట్టడి చేయడం కోసం, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: