అందుకే సినిమా షూటింగ్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని భావించినప్పటికి అంతకంటే ముందే దేవర వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక 2 పార్ట్ లుగా విడుదల అవ్వబోతున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. దేవర 1 కి సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్, శ్రీకాంత్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు అంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది.
ఇక ఈ షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ లతో ఫారిన్ లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ చేయబోతున్నట్టు సమాచారం. దాంతో దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి కాగా ఆ తరువాత పార్ట్ 2 కూడా షూట్ చేస్తారని వినికిడి. ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి లేదా రెండో వారంకు దేవర 1 కి సంబంధించిన షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టే విధంగా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జులై నెలలో షూటింగ్ పూర్తి చేయాలని భావించినా కూడా సినిమా పెద్దది కాబట్టి ఒకటికి రెండుసార్లు సీన్లు షూట్ చేయాల్సి వచ్చేదని, దాంతోనే ఒకటి లేదా రెండు వారాలు అదనంగా సినిమాకు డేట్లు కేటాయించాల్సి వస్తుంది అంటూ మేకర్స్ సన్నిహితుల వద్ద చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం జాప్యం ఉండదని... అక్టోబర్లో సినిమా తప్పకుండా ఉండబోతుందని అంటున్నారు.